KTR : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ కార్యకర్తలే భయపడరని, మేమెలా భయపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్‌లో ఉన్నాడని, అతని పేరు మర్చిపోయాడని ఒక యాక్టర్‌ను జైల్లో వేశాడని, హీరోలు వచ్చి కలువకపోతే జీవోలు ఇవ్వడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిలా అందరూ దొంగలే ఉంటారని భ్రమపడుతున్నాడని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. ‘దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలను ముట్టుకోమనండి చూద్దాం’ అని సవాల్ విసిరాడు. పదేళ్లు తాము ఇలాంటి రాజకీయాలు చేసివుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేదా..? అని అడిగారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్‌కు పోయి చదువుకున్నాక అయినా ఈ లాగుల తొండలు ఇడిసే భాష ఆగిపోతదేమో చూడాలని అన్నారు.
మీరూ హార్వర్డ్‌కు పోయి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కూడా రేవంత్‌రెడ్డి బాత్రూములు కడిగేవాళ్ళు అని తిడుతడేమో అని తన ముందున్న వారిని ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి గ్యాంగ్ సింగరేణిలో 7 టెండర్లు తీసుకుందని అన్నారు.
సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే అడ్డమైన విధానంతో రేవంత్ రెడ్డి బావమరిది గ్యాంగ్ టెండర్లు దక్కించుకుందని విమర్శించారు. గతంలో మైనస్‌లోకి వెళ్ళిన టెండర్లు ఈ సైట్ విసిట్ సర్టిఫికెట్ విధానం తర్వాత ప్లస్‌లోకి వెళ్ళాయని కేటీఆర్ చెప్పారు. హరీష్ రావు శాసనసభలో మంత్రులనే ఫుట్ బాల్ ఆడారని, ఆయనను ఓ నలుగురైదుగురు పోలీసుల ముందు కూర్చోబెడితే ఏం ఫరక్ పడుతుందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బతుకంతా లీకుల మీదనే అని విమర్శించారు. ‘ఇంకెన్ని రోజులు లీకుల మీద బతుకుతావు?’ అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తప్పు జరిగిందని అంటావని, మరి ఒక్క అధికారి కూడా బయటకి వచ్చి అధికారికంగా ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ నిలదీశారు. ‘తాను చెడ్డ కోతి వనమంతా చెడిపింది’ అన్నట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి గతంలో దొంగ పనులు చేస్తూ డబ్బు సంచులతో దొంగలా దొరికాడని, కాబట్టి అందరూ అలానే ఉంటారని అనుకుంటున్నాడని కేటీఆర్ ఎగతాళి చేశారు.