హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారత్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ అవసరాలు, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల మీద దృష్టిసారించాలని రైతులకు సూచించారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా తెలంగాణ వేరుశెనగలో ఎనిమిది రెట్లు ఎకువ ప్రొటీన్స్ ఉంటాయని చెప్పారు. కానీ వారు వారి ఉత్పత్తికి ఎకువ ప్రాచుర్యం కల్పించారని, ప్రపంచంలోని అనేక దేశాల్లో పీనట్ బట్టర్‌కు డిమాండ్ ఉన్నదని తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో ‘వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు-తెలంగాణ’ అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ.. తెలంగాణలో యాసంగిలో వేరుశెనగ సాగుకు రైతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అప్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని వివరించారు. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ పథకాలతో తెలంగాణలో వాటి మాంసం ఉత్పత్తి పెరిగిందని, ఎగుమతుల మీద దృష్టి సారించాలని సూచించారు.
ఎగుమతులు పెరగాలి
దేశంలో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వ నినాదాలు కాదు.. విధానాలు మారాలని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పెంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రాష్ర్టానికి అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమలశాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారని, ఒక మంచి పాలసీని ముందుకు తెస్తే తకువ సమయంలో అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉన్నదని కొనియాడారు. అత్యధిక మంది ఇష్టపడుతున్న నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారని ప్రశంసించారు. సదస్సులో ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజాప్రభాకర్, టీఎస్‌టీపీసీ జేఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.