మునిపల్లి,డిసెంబర్ 12: మాజీ మంత్రి బాబూ మోహన్‌కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ప్రజాగోస పేరిట బాబూ మోహన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంకోల్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని ప్రగల్భాలు పలుకుతున్న బాబూ మోహన్‌కు ఓ మహిళ అడ్డు తగిలి నిజాలు మాట్లాడేసరికి తెల్లమొఖం వేసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ‘గ్రామంలో నువ్వు చేసింది ఏమీ లేదు. అంత మా సీఎం కేసీఆర్ సార్ వల్లే అభివృద్ధి జరిగింది’ అంటూ ఎదురు చెప్పింది. దీంతో ఏం మాట్లాడాలో పాలుపోక అక్కడి ప్రజలకు దండం పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, లింగంపల్లి, మొగ్దుంపల్లి, బోడిశెట్పల్లి, మేళసంగం, అంతారం, పెద్దచెల్మెడ, తాటిపల్లి, మనుసాన్పల్లి గ్రామాల్లో చేపట్టిన ర్యాలీకి అశించిన స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు రాలేదని స్థానిక నాయకులపై బాబూమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి.. లేకపోతే బయటకు వెళ్లండి. బీజేపీలో మీసం మొలువని వాళ్లే ఎక్కువ ఉన్నారు. మీసం మొలిసినోడు ఒక్కడూ గతిలేడు’ అంటూ కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడారు.