హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలో పాగా వేసేందుకు ఇతర శాఖల ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. దేవాదాయశాఖలోని ఖాళీ పోస్టులను ఇతర శాఖల ఉద్యోగులతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 9న దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు పలు శాఖలకు డిప్యూటేషన్‌కు అర్హత కలిగిన ఉద్యోగులను పంపాలని లేఖ రాశారు. ఒకవైపు ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతుండగానే మరోవైపు 30 మంది అధికారులు రెవెన్యూ, మున్సిపల్, పంచాయత్‌రాజ్ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై ఎండోమెంట్లోకి వచ్చి చేరారు. వీరికి బాధ్యతల అప్పగింతపై ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇంకోవైపు, మరో 44 మంది ఉద్యోగులను కూడా ఇలానే ఇతర శాఖల నుంచి తీసుకోనున్నట్టు తెలిసింది.
సంబంధంలేని వారితో నింపేస్తున్నారు
దేవాలయాల పాలనా వ్యవస్థ నిర్వహించే కార్యనిర్వాహణాధికారుల స్థానంలో వేరే శాఖల వారు డిప్యూటేషన్‌పై రావడాన్ని ఉద్యోగులతోపాటు భక్తులు కూడావ్యతిరేకిస్తున్నారు. దేవాలయాల్లో జరిగే నిత్యకైంకర్యాలు మొదలు.. భక్తులతో అనుసంధానమయ్యే విషయంలో ఇతరులు ఎలా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక డిప్యూటీ కమిషనర్, ఆరుగురు అసిస్టెంట్ కమిషనర్లు, ఆరుగురు గ్రేడ్-1 కార్యనిర్వాహణాధికారులు, 61 మంది గ్రేడ్-3 కార్యనిర్వాహణాధికారుల పోస్టులను ఇతర శాఖలకు అప్పగించడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. ఇప్పటికే పంచాయత్‌రాజ్‌శాఖ తమ సిబ్బందిని ఎండోమెంట్లోకి డిప్యూటేషన్‌పై పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగుల అంగీకారం తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలోని జిల్లాపరిషత్ సీఈవోలకు మార్గదర్శకాలు పంపింది. ఇదే తరహాలో మిగతా శాఖలు కూడా తమ ఉద్యోగులను డిప్యూటేషన్‌పై పంపేందుకు సిద్ధమవుతున్నట్ట సమాచారం.
పెన్‌డౌన్ దిశగా ఉద్యోగులు
ఇతర శాఖల నుంచి ఉద్యోగులు డిప్యూటేషన్‌పై విధుల్లోకి వస్తే తాము విధులు బహిష్కరిస్తామని దేవాదాయశాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శనివారం కమిషనర్‌ను కలిసి నిరసన వ్యక్తంచేయాలని భావించారు. అయితే, ఈ విషయంపై తర్వాత మాట్లాడదామని ఆయన తప్పించుకున్నట్టు తెలిసింది. మరోవైపు, సమస్యల పరిష్కారం కోసం ఆ శాఖలోని డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు కలిసి ఇటీవల జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రెవెన్యూశాఖలోని ఆర్డీవోలు, అంతకంటే పైస్థాయి అధికారులను యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ వంటి దేవాలయాలకు ఈవోలుగా నియమించేవారు.
కానీ, ఇప్పుడు వేరే శాఖల ఉద్యోగులతో దేవాదాయశాఖ ఖాళీలను నింపాలని చూస్తుండటాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేవాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయశాఖ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఇతర శాఖల నుంచి అధికారులను నియమించిన దాఖలాలు లేవని జేఏసీ నేతలు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభు త్వం మొండిగా వ్యవహరిస్తే తాము విధులు బహిష్కరించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. అయి తే బోనాల సీజన్ కావడంతో భక్తులకు ఇబ్బం ది తలెత్తకూడదనే ఉద్దేశంతో తొందరపాటు నిర్ణయం తీసుకోవడంలేదని, కమిషనర్‌ను మరోసారి కలిసి, వారి స్పందనను బట్టి పెన్‌డౌన్ చేస్తామని జేఏసీ నేతలు వివరించారు.