Osmania University | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : తరగతి గదిలో కూర్చుని అంటార్కిటికాలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల బృందం అన్వేషణ గురించిన సమాచారాన్ని అందుకోవడమంటే మన ఊహకందని విషయం. కానీ ఇలాంటి ఊహను ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు నిజం చేసుకోబోతున్నారు. నేరుగా శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ కానున్నారు. అంటార్కిటికా స్పేస్ రీసెర్చ్ లింక్‌ను ఓయూతో అనుసంధానించనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఉస్మానియా వర్సిటీ ఇస్రోతో ఎంవోయూను కుదుర్చుకోనుంది. ఈ ఎంవో యూ ద్వారా స్పేస్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తారు.
అంటార్కిటికాలో వాతావరణ మార్పులపై ఇస్రో పరిశోధనలను నిర్వహిస్తున్నది. ఓజోన్ సాంద్రత, జియో ఫిజికల్ రీసెర్చ్, మంచు డ్రిల్లింగ్, జీవులు, వన్యప్రాణుల అధ్యయనం చేస్తున్నది. ఆయా అంశాల్లో ఇస్రోశాస్త్రవేత్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ అన్వేషణలో ఉపయోగించే సాధనాలు, వాటి నిర్వహణపై తర్ఫీదునిస్తారు. అంతరిక్ష నావిగేషన్ వ్యవవస్థ, అంతకరిక్ష సాధనాల నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించేందుకు ఈ ఎంవోయూ సహకరించనున్నది. డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఈ నైపుణ్య శిక్షణనిచ్చేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నది.