 
                                                            ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 11: ‘ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులు, నిరుద్యోగులపై దాడిచేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రజాపాలన అంటే దాడులు చేయడమా? శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పా? ఓయూలో 300మంది పోలీస్ సిబ్బంది ఎందుకు పహారా కాస్తున్నట్టు? దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’ అని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
బుధవారం ఓయూలో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు, విద్యార్థులు, వార్తల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల దాడి, అరెస్టులను తీవ్రంగా ఖండించాయి. ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుతుంటే పరిష్కరించకుండా ఓయూను పోలీస్ క్యాంపుగా మార్చారని, హాస్టళ్లు, క్లాస్‌రూమ్‌లు, లైబ్రెరీల్లోకి చొరబడి అరెస్టులు చేస్తూ, భౌతిక దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థి నాయకులను అరెస్టు చేసిన సందర్భాలు లేవని గర్తుచేశారు. ఓయూలో పోలీసు పహారాను తొలగించి ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఓయూలో పోలీసుల దాడులు అమానుషమని, ఈ ఘటనను ఖండిస్తున్నామని పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు ఎస్. నాగేశ్వరరావు, ఓయూ అధ్యక్షుడు సుమంత్ చెప్పారు. ప్రతిష్ఠాత్మక ఆర్ట్స్ కళాశాల తెలంగాణ ప్రజలకు భరోసా కేంద్రమని, ఇక్కడించి తమ గొంతు వినిపిస్తే న్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో ఉంటుందని, అలాంటి ఓయూలో పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ, గల్లాలు పట్టి ఈడ్చుకుపోవడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రశ్నించే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ అని టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. ఓయూలో దాడులు ప్రజాస్వామ్యానికే విరుద్ధమని, ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులు, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు దారుణమని దక్షిణ భారత జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. తార్నాకలోని తన కార్యాలయంలో విలేకరులతో యన మాట్లాడుతూ న్యాయం చేయాలని మూడు నెలలుగా 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు నిరసన తెలుపుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం, మరోవైపు విధుల్లో ఉన్న విలేకరులపై దౌర్జన్యం చేస్తూ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. తక్షణమే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న బక్క జడ్సన్, అశోక్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
 
                            