పోచమ్మమైదాన్, ఆగస్టు 11 : ఓరుగల్లు సాహితీ ‘రుద్రమ’గా పిలుచుకునే అనిశెట్టి రజిత (67) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామికవాదిగా, స్త్రీ చైతన్యస్రవంతిగా అప్రతిహతంగా కొనసాగిన ఆమె ప్రస్థానం ముగిసింది. 1969 తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఆమె తన 11 ఏండ్ల ప్రాయంలోనే తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు. ప్రజాకవి కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణకు జరిగిన అన్ని రకాల దాడులపై ఒక కవయిత్రిగా, రచయిత్రిగా ఆమె స్పందించారు. రచయిత్రిగా, సంపాదకురాలిగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం కృషి చేశారు.
1973లో ‘చైతన్యం పడగలెత్తింది’తో ప్రారంభమైన ఆమె రచనా వ్యాసాంగం నిరంతర అక్షరప్రయాణమై పల్లవించారు. తెలంగాణ భాష, సంస్కృతిని హేళన చేసిన వారెంతటివారైనా సరే ఆమె ఎన్నడూ ఉపేక్షించలేదు. తెలంగాణను ఉపప్రాంతం అంటే ‘ఉప్పుపాతరేస్తాం’ అని హెచ్చరించిన రచయిత్రిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అలాగే స్త్రీవాద రచయిత్రిగా, మార్కెట్ మాయాజాలంలో మహిళను సరుకుగా చేయొద్దని విస్తృతంగా రచనలు చేశారు.
2017లో కేసీఆర్ సర్కార్.. సాహిత్యంలో ‘విశిష్ఠ మహిళా పురస్కారం’తో ఆమెను సత్కరించింది. అలాగే ప్రపంచమే అబ్బురపడేరీతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం నాడు వేసిన కమిటీలో ఆమెను సభ్యురాలిగా నియమించింది. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు ప్రతిభాపురస్కారాన్ని అందజేసింది. అనిశెట్టి రజిత అకాలమరణం పట్ల పలువురు సాహితీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.