హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): భారత్‌లో 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం రెండు గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కోరారు.
భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రా యగిరిలో స్విమ్మింగ్‌పూల్, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేటలో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీగ్రౌండ్ ఆధునికీకరణకు రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్ని విధాలా కృషి చేస్తున్నదని, తగిన సహకారం ఇవ్వాలని సీఎం కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, టీం ఇండియా మాజీ కెప్టె న్ కపిల్దేవ్తోనూ సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్‌సిటీని ఏర్పాటుచేసేందుకు అజయ్ దేవగణ్ ఆసక్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలతో కూడిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబందించి సీఎంకు ప్రతిపాదనలు అందించారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్, క్రికెట్ దగ్గజం కపిల్‌దేవ్ మధ్య చర్చలు జరిగాయి.