Sircilla | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు పెద్దల కక్షసాధింపు చర్యలకు అమాయక రైతులు బలవుతున్నారు. అసైండ్ ల్యాండ్ సాకు చూపుతూ ఇప్పటివరకు నేతలపై విరుచుపడ్డ యంత్రాంగం.. ఇప్పుడు సాధారణ ప్రజల్నీ వదలడం లేదు. నిన్నటివరకు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఓసామాన్య రైతును రిమాండ్‌కు తరలించడం కలకలం రేపింది. గొంతు ఇన్ఫెక్షన్తో మూడు రోజుల క్రితం ఆపరేషన్ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న రైతుపై ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడం విమర్శల పాలవుతున్నది. ఒకే ఇంటిపేరు ఉండటంతో బీఆర్ఎస్ నాయకుడికి బదులు రైతుపై ప్రతాపం చూపించారంటూ బాధిత కుటుంబం చెప్తున్నది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డి (52) తన తాతల నుంచి సంక్రమించిన 30గుంటల భూమిని యాభై ఏళ్లుగా కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. 2018లో సాదాబైనామాతో గుర్తించి పీఓటీ చట్టం ద్వారా రాజిరెడ్డి తన పేరుమీదకు మార్చుకోగా, రెవెన్యూ అధికారులు పట్టాపాసుబుక్కు కూడా ఇచ్చారు.
సాగు చేసుకుంటున్న భూమిని కబ్జా చేశాడంటూ ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరుపకుండానే రైతు రాజిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారని రాజిరెడ్డి భార్య లత, అన్న కూతురు లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. గొంతు సర్జరీ అయ్యిందని చెప్పినా, బలవంతంగా మోటర్ సైకిల్‌పై తీసుకుపోయారని వారు కన్నీటిపర్యంతమయ్యా రు. ‘మా తాతల కాలం నాటి భూమిని మా బాబాయ్ సాగుచేస్తున్నడు. అబ్బాడి అని ఇంటి పేరున్నందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేసిండ్రు’ అని లావణ్య తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రైతు రాజిరెడ్డిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ రామ్మోహన్ చెప్తున్నారు. అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కేసులతో వేధిస్తున్నదని బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల శాఖ అధ్యక్షుడు గజబింకార్ రాజన్న మండిపడ్డారు.