CREDAI | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అలాంటి రంగం తెలంగాణలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ మందగమనం ఏడాది కాలంగా కొనసాగుతుండగా, తాజాగా హైడ్రా కూల్చివేతలతో మరింత కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నదని రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్.. హైడ్రా కమిషనర్‌కు విన్నవించింది.
హైడ్రా బృందం వచ్చివెళ్లిన ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు కన్నెత్తి చూడటం లేదు. దీనికి తోడు చెరువులు, నాలాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు భయపడుతున్నారు. దీనికి పరిష్కారమార్గాన్ని హైడ్రానే చూపాలంటూ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీనిపై రంగనాథ్ స్పందిస్తూ.. కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్‌పై తీవ్రప్రభావం పడిందని, ఇది తాత్కాలికమేనని అన్నారు.
కొందరు బిల్డర్లు నాలాలపై స్లాబ్ వేసి చెరువులు పూడ్చి సెట్‌బ్యాక్ చూపుతున్నారనే ఫిర్యాదులొచ్చాయని, విచారణ అనంతరం ఏ అక్రమణలు లేవని తేలితే బిల్డర్లు కోరినట్టు లేఖ ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. హైడ్రా నేరుగా నోటీసులు ఇవ్వదని, స్థానిక సంస్థల నోటీసులను బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక, గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా ప్రత్యేక అధికారాలతో చట్టబద్ధతను కలిగి ఉంటుందని.. అక్టోబర్‌లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
‘ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై 19న జీవో నంబరు 99 ద్వారా హైడ్రాను ఏర్పాటుచేసింది. నీరు, భూమి, చెట్లు (వాల్టా) చట్టం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, నీటి పారుదల చట్టం వంటి వాటి నుంచి వివిధ చట్టాల కింద అధికారాలు హైడ్రాకు అప్పగిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతున్నది. విధానపరమైన పత్రం సిద్ధమయ్యాక క్యాబినెట్ ఆమోదం కోసం పంపుతారు. క్యాబినెట్ తీర్మానం ఆమోదించిన 6 వారాల్లో శాసనసభలో ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుంది’ అని పేర్కొన్నారు.