Griha Jyoti | జగిత్యాల, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రతి పథకం లోపభూయిష్టంగానే కనిపిస్తున్నది. ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారికి కరెంట్ బిల్లులు మాఫీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, విద్యుత్తుశాఖకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. గృహజ్యోతి పథకం సైతం ఆరిపోయినట్టుగానే కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించిన వారి కరెంట్ బిల్లులను షరతులు లేకుండా మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి నెల నుంచి గృహజ్యోతి పథకం అమలును ప్రారంభించింది. అయితే, చాలామంది లబ్ధిదారులకు పథకం వర్తించలేదు. మార్చిలో జగిత్యాలలో వేలమందికి పథకం వర్తించలేదు. రాష్ట్రవ్యాప్తంగానూ ఎంతోమంది అర్హులకు కరెంటు బిల్లులు వచ్చాయి. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. స్పందించిన ప్రభుత్వం అర్హులు ఎవరూ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని, అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. బిల్లులు చెల్లించక్కర్లేదని సీఎం నుంచి కలెక్టర్ల వరకు అందరూ చెప్పడంతో వినియోగదారులు బిల్లు చెల్లించడం మానేసి పథకానికి మరోమారు దరఖాస్తు చేసుకున్నారు.
దాదాపు ఆరు నెలలుగా జీరో బిల్లు జనరేట్ కాని వారికి సంబంధించిన బకాయిలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి విద్యుత్తుశాఖకు ఉత్తర్వులు అందాయి. జీరో బిల్లు ఎప్పటి నుంచి జనరేట్ అవుతోందో అప్పటి నుంచే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి జీరో బిల్లు రానివారి నుంచి బిల్లులు వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్తు అధికారులు బకాయిల వసూలుకు నడుంబిగించారు.
ఒక్క జగిత్యాలలోనే బిల్లు చెల్లించని బిల్లులు చెల్లించని లబ్ధిదారుల సంఖ్య 50 వేల వరకు ఉంటుందని అంచనా. జగిత్యాల జిల్లా పరిధిలో గృహ అవసరాలకు సంబంధించి 3,29,043 మంది వినియోగదారులు ఉన్నారని, వీరిలో 1,99,270 మందికి గృహజ్యోతికి సంబంధించిన జీరో బిల్లు జనరేట్ అయిందని చెప్తున్నారు. అంటే, 50,338 బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో వారి నుంచి ఈ ఆరు నెలలకు సంబంధించి రూ.7.25 కోట్లు వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు.
గృహజ్యోతి పథకంలో అర్హులైన వినియోగదారుల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అర్హత ఉన్న వారికి బిల్లులు మాఫీ చేస్తామని, కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం, ఆరు నెలలు గడిచాక తీరా ఇప్పుడు మొత్తం బిల్లులు ఒకేసారి చెల్లించాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాది జగిత్యాల. నా భర్త ఎనగంటి రవికుమార్. ఔసుల పని చేస్త్తడు. నేను బీడీ కార్మికురాలిని. మాకు ముగ్గురు పిల్లలు. మేం శ్రీరాంనగర్లో కిరాయికి ఉంటున్న. నాలుగు బల్బులు, మూడు ఫ్యాన్లు మాత్రమే ఉన్నయ్. పెద్దగా కరెంట్ వాడకం ఉండదు. బిల్లుకూడా ఎక్కువ రాదు. గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నా జీరో బిల్లు రాలేదు. సీఎం, మంత్రులు చెప్తున్నరని మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకున్నం. అయినా ఆరు నెలల నుంచి నెలనెలా బిల్లు వస్తూనే ఉంది. ఏ నెల కూడా మేం 200 యూనిట్లకు ఎక్కువ వాడుకోలే. మాఫీ అయితయని అనుకున్నం. మొన్న కరెంట్ బిల్లు వచ్చింది. 93 యూనిట్లు వాడుకున్నందుకు రూ. 320 వచ్చింది. ఈ బిల్లుతో పాటు, పాత ఐదు నెలల బిల్లుల బకాయిలు మొత్తం రూ.1800 కట్టాలని బిల్లు ఇచ్చినాయన చెప్పిండు. లేదంటే కరెంటు కట్ చేస్తమని చెప్పి వెళ్లిండు. ఇదేం పద్ధతి.. ఇదేం లెక్క.. మాఫీ అంటిరి. బిల్లు కట్టకుండ్రి అంటిరి. ఇప్పుడు ఒకటేసారి ఆరు నెలల బిల్లు కట్టమంటే ఎట్ల? సర్కార్ ముచ్చటనే అర్థమైత లేదు.