హైదరాబాద్, అక్టోబర్29 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే సీఐడీ, పోలీసులు సహాయం తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేసింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలతో బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ప్రభుత్వం అమలు చేస్తున్నది. నిబంధనల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ బకాయిల చెల్లింపును నిలిపేసింది. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి రూ. 10 వేలకోట్లుకు పైగానే బకాయిలు పేరుకుపోయాయి. నిధులు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు సుదీర్ఘకాలంగా మొరపెట్టుకుంటున్నాయి.
గతంలో కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. అదీగాక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేశాయి. విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాలు సైతం నిధుల విడుదల కోసం పోరాటాలకు దిగాయి. ఎప్పటికప్పుడు రేపుమాపు అంటూ సర్కారు దాటవేస్తూ వస్తున్నది తప్ప రూపాయి కూడా విడుదల చేయలేదు. నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం రూ. 1,207 కోట్ల మేరకు టోకెన్లు జారీ చేసినా ఒక్క రూపాయి కూడా విదల్చేదు. ఇటీవల ఆ నిధులను దీపావళి లోపు విడుదల చేస్తామని హామీనిచ్చినా కేవలం రూ. 300 కోట్లును మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. నిధులను విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారింది. దీంతో యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. నవంబర్ 3 నుంచి కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునివ్వగా, విద్యార్థి సంఘాలు సైతం ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. అయితే నిధులు విడుదల చేసి బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు అండగా నిలవాల్సిన సర్కారు ఇప్పుడు కక్ష సాధింపులకు దిగింది. బకాయిల కోసం కాలేజీలు ఒత్తిడి చేయడాన్ని సహించలేక తనిఖీల పేరిట బంద్ పిలుపును నిలువరించేందుకు సిద్ధమైంది.
తక్షణం తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పొందుతున్న అన్ని కాలేజీల్లో తక్షణం తనిఖీలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగానికి, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. తనిఖీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పలు కాలేజీలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి తనిఖీ చేశామని వెల్లడించారు. అందులో పలు కాలేజీలు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించామని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలను తక్షణం తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ స్కీంకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఎస్సీ అభివృద్ధిశాఖ, హయ్యర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు సైతం కచ్చితంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీల్లో పాల్గొనాలని ఆదేశించారు. బీఈడీ, డీఈడీతోపాటు అన్ని కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే పోలీస్, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్ల సాయం కూడా తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తనిఖీల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శాలను జారీ చేసింది. తక్షణం తనిఖీలను చేపట్టి నివేదికను సమర్పించడంతోపాటు, నోడల్ ఏజెన్సీతో కలిసి స్కీంకు సంబంధించి ప్రత్యేకంగా సిఫారసులు కూడా చేయాలని విజిలెన్స్ డీజీని సర్కారు ఆదేశించింది.
వెనక్కి తగ్గేదిలేదు.. దేనికైనా సిద్ధం
ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించడంపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (ఫతి) ఘాటుగా స్పందించింది. బకాయిలడిగితేనే తనిఖీలు గుర్తుకొస్తున్నాయా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అయినప్పటికీ “మా పోరాటం ఆగదు, ఎన్ని బెదిరింపులొచ్చినా వెనక్కి తగ్గం, ఏ కష్టాలను ఓర్చుకునేందుకైనా సిద్ధం. త్యాగాలకు వెనుకాడబోం. ఈసారి పోలీసులను కాలేజీల్లోకి రానివ్వం. భయబ్రాంతులకు గురిచేస్తే ఊరుకోబోం” అని హెచ్చరించింది. నిధులను విడుదల చేయకపోవడంతో కాలేజీ నిర్వహణ భారంగా మారిందని, సిబ్బందికి ఫీజులు చెల్లించలేక అప్పుల పాలై కాలేజీలను మూసివేసుకునే దుస్థితి నెలకొన్నదని వివరించింది. కాలేజీ దుర్భర పరిస్థితిని అనేకసార్లు వివరించినా పట్టించుకునేవారే లేకుండా పోయారని, గత్యంతరం లేక బంద్ పిలుపునిచ్చామని వెల్లడించింది.
భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
ప్రభుత్వం తాజా ఆదేశాలపై విద్యార్థి సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. బకాయిల విడుదల విషయంలో సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తుతున్నాయి. ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదని చెప్తున్నారు. దీంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని వివరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా కక్ష సాధింపులకు దిగడమేంటని నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇకనైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి, ఆపై తగిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే భవిష్యత్తు పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థలపై కక్ష సాధింపు దుర్మార్గంబీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని అడిగిన పాపానికి ప్రైవేట్ విద్యాసంస్థలపై కక్ష సాధించడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురవ విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడికి భయపడే ఇలాంటి తప్పుడు చర్యలకు దిగుతున్నదని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. విజిలెన్స్ తనిఖీల పేరిట కాలేజీల యాజమాన్యాలను బెదిరించేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రైవేట్ కాలజీల యాజమాన్యాలు నవంబర్ 3నుంచి చేపట్టనున్న కళాశాలల బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.