సిద్దిపేట, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయ్. వారికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సీఎం కేసీఆర్ ఆచితూచి.. కన్న తండ్రిలాగా, కుటంబసభ్యుడిలా ఆలోచించి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తయారు చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టారని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఎవరి పథకాలు ఎవరు కాపీ కొట్టారో సోయి తెచ్చుకోవాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించి అక్కడే మీడియాతో మాట్లాడారు.
రైతుబంధు రూపకర్త కేసీఆర్ అని, తమ పథకాన్ని కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టారని విమర్శించారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్ అయితే, నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా అనే విధంగా మ్యానిఫెస్టోలో పెట్టారని చెప్పారు. రైతుబీమాతో 1.11 లక్షల మంది రైతులు లబ్ధిపొందారని, పేద ప్రజల ధీమా కోసం కేసీఆర్ బీమా ఉంటుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ వంటి పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, నేడు సౌభాగ్యలక్ష్మి అనే పథకాన్ని మహిళల కోసం తెచ్చారని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తున్నామని, టికెట్లు అమ్ముకుంటున్నారని గాంధీభవన్‌లో ధర్నాలు చేసి దిష్టిబొమ్మలు తగలబెడుతన్నారని, ఢిల్లీలో సైతం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నాడు రేవంత్‌రెడ్డిది ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు సీటు అనేది రేవంత్‌రెడ్డి నినాదమని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు.
ఇలాంటి వారికి ఓటేస్తే రాష్ర్టాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు. మాట్లాడితే కాంగ్రెస్ వాళ్లు ఒక్కసారి అవకాశమివ్వమని అడుగుతున్నారని, రాష్ట్రంలో 11 సార్లు అవకాశమిస్తే ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు కేసీఆర్‌కు అవకాశమిచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అనూహ్య అభివృద్ధి జరిగింది కాబట్టే మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. మళ్లీ హ్యాట్రిక్ కొట్టి సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమే చెప్పారు. కేంద్రంలోని బీజేపీ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణకు వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి మాట్లాడుతున్నారని, వారు కనీసం డిపాజిట్ తెచ్చుకొనే పరిస్థితి కూడా లేదని చెప్పారు. ఆ పార్టీ కనీసం పోటీలో కూడా నిలువబోదని అన్నారు.