మళ్లీ పిల్లి మొగ్గ. మరోసారి పొల్లు మాట. అవే కల్లబొల్లి మాటలు. అంతకుమించి నంగనాచి మాయలు. హుజూరాబాద్ ప్రజల సాక్షిగా బీజేపీ నేత ఈటల రాజేందర్ తన నయవంచక నాటకానికి మరోసారి తెరతీశారు. తానేదో కష్టంతో తల్లడిల్లిపోతున్నట్టు, తలా వెయ్యి రూపాయలిచ్చి ఆదుకోవాలన్నట్టు బీద అరుపులు మొదలుపెట్టారు. ఎన్నికల కోసం ఎన్ని వందల కోైట్లెనా ఖర్చుపెడతా, ఎకరం అమ్మితే చాలు ఒక ఎన్నిక గెలుస్తా అని కొద్దిరోజుల క్రితమే అహంకారంతో సభాముఖంగా ప్రకటించుకున్న రాజేందర్… ఇప్పుడెందుకు ఇంటికో వెయ్యి చందా ఇవ్వాలనే పాట పాడుతున్నారు? పైసల్లేక తల్లడిల్లి పోతున్నట్టు తమాషా ఎందుకు చేస్తున్నారు?
తెరవెనుక ఆసక్తికరంగా సాగుతున్నఅసలు కథ ఏమిటంటే…
“ఇదే రాజేందర్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారో అందరికీ తెలుసు. ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తా.. అని గర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజా బలంతో కాకుండా, జనాభిమానంతో కాకుండా పైసలతో ఎన్నికలు గెలుస్తానని రాజేందర్ ఆనాడే చెప్పారు. డబ్బుల్లేకపోతే ఆ మాట ఎలా చెప్పగలడు? అసలు విషయం ఏమిటంటే… లోపలున్న డబ్బును బయటకు తెచ్చేందుకే ఈ ఎత్తుగడ. ఇదో కొత్త నాటకం. రాజేందరే తన పైసలను నమ్మకస్తులు కొందరికి పంచుతాడు. మళ్లీ వాళ్లే తనకు చందాలిచ్చినట్టు షో చేస్తాడు. తద్వారా తానేదో కష్టాల్లో ఉన్నట్టు, జనమే తనకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రచారం పొందడం ఆయన పన్నాగం. ఇందులో భాగంగానే ఆయన ఇంటికో వెయ్యి చందా అడుగుతా అన్నాడు. ఇదో ఎలక్షన్ జిమ్మిక్. చీప్ టాక్టిక్” –రాజేందర్‌కు దశాబ్దాలుగా సన్నిహితంగా మెదిలిన నేత
కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళితబంధు పథకాన్ని మొదట ఆషామాషీగా తీసుకొన్న విపక్షాలకు, రోజులు గడిచేకొద్దీ అసలు సంగతి అర్థమైంది. ఈ పథకం అమలు పట్ల కేసీఆర్ ఎంతో పట్టుదలతో ఉన్నారన్న విషయాన్ని, ఆయన చేపట్టిన వరుస సమీక్షలతో వారు గుర్తించారు. పథకాన్ని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సంపూర్ణ స్థాయిలో దళిత బంధును అమలు చేయడం, లబ్ధిదారులను ఎంపిక చేయడం, డబ్బులు కూడా పంపిణీ చేయడాన్ని వారు గమనించారు. దళిత బంధు అమలుకు పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయడమే కాకుండా, 500 కోట్ల నిధులు కూడా ఇవ్వడంతో ఇక కేసీఆర్‌ను అడ్డుకోవడం సాధ్యం కాదని వారు ఒక అంచనాకు వచ్చారు. దళిత బంధు పథకం ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పలు నేషనల్ మీడియా కరెస్పాండెంట్లను ఇది ఆకర్షించింది. రాష్ట్రంలోనూ పలువురు సామాజిక ప్రముఖులు, పార్టీలకు అతీతంగా నేతలు ఈ పథకాన్ని స్వాగతించారు. వామపక్ష పార్టీలతోపాటు, బీజేపీ దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ ముఖ్యనేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆ పార్టీ దళిత నేత సర్వే సత్యనారాయణ తదితరులు దళిత బంధును బహిరంగంగా ప్రశంసించారు. జీవన్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి, ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించిన తర్వాతే పథకాన్ని ప్రకటిస్తారని, దాన్ని పూర్తి కూడా చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో మొదట్లో దళితబంధును విమర్శించిన విపక్ష నేతలు మెల్లిగా రూటు మార్చారు. 10 లక్షలు కాదు, 30 లక్షలు ఇవ్వాలని ఒకరంటే, గిరిజనులకూ ఇవ్వాలని మరొకరు అన్నారు. మొత్తమ్మీద ఏదో రకంగా అడ్డంకులు సృష్టించి పథకాన్ని అపాలన్నదే వాటి అసలు ఎత్తుగడ. కేసీఆర్ గతంలో చేపట్టిన పథకాల విషయంలోనూ ఇదే జరిగింది. 24 గంటల కరెంటు ఇస్తానంటే, అలా ఇస్తే గులాబీ కండువా కప్పుకొంటానంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ నేత జానారెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. కాళేశ్వరం కడుతా అంటే అయ్యేదా? పొయ్యేదా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు అనేకమంది దీర్ఘాలు తీశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తానంటే అందులో అవినీతి అంటూ ఆరోపణలు చేశారు. మిషన్ కాకతీయపైనా అంతే. అయినా కేసీఆర్ ఆరోపణలను, విమర్శలను పట్టించుకోకుండా పథకాల మీద దృష్టి కేంద్రీకరించి వాటిని పూర్తిచేసి ప్రజల అనుభవంలోకి తెచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ దళిత బంధు పథకం అమలుపైనే దృష్టి పెట్టి, నిరంతర సమీక్షలతో తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఈ స్కీం కూడా సక్సెస్ కావడం ఖాయమని రాజేందర్ సహా బీజేపీ, కాంగ్రెస్ నేతలందరికీ అర్థమైంది. దీంతో ఏదో ఒక లొల్లి చేసి, గాయి గత్తర సృష్టించి, దీన్ని అడ్డుకునే పిచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టారు.. గతంలో కాళేశ్వరం, భగీరథ, కాకతీయ విషయంలో చేసినట్టుగానే! అందులో భాగమే శుక్రవారం హుజూరాబాద్‌లో కొన్నిచోట్ల ఆందోళనల పేరిట జరిగిన లొల్లి. దళిత బంధు అమలుకు లక్ష కోైట్లెనా ఖర్చుపెడతానని, ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే రెండు వేల కోట్ల దాకా ఇవ్వడానికి సిద్ధమని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం అమలుపై దళితులు పూర్తి భరోసాగా ఉన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌లో ప్రస్తుతం వివరాల సేకరణ మాత్రమే జరుగుతున్నది. విషయం లబ్ధిదారుల ఎంపిక దాకా రానేలేదు. కలెక్టర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందువల్ల ఇప్పుడే జాబితాల తయారీ ప్రసక్తే లేదు. అయినా బీజేపీ నేతలు విష ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా అబద్ధాలు అల్లారు. అక్కడా ఇక్కడా పార్టీ కార్యకర్తలు నలుగురైదుగురిని పోగేసి గలాటా చేయడానికి ప్రయత్నించారు. ‘ఇది ప్రీ ప్లాన్డ్ ఆర్కెస్ట్రేటెడ్ షో కాకపోతే వేర్వేరు మండలాల్లో, వేర్వేరు గ్రామాల్లో ఒకేసారి ధర్నాల పేరుతో షో.. వెంటనే అవన్నీ బీజేపీ అనుకూల చానెళ్లలో ప్రసారం ఎలా జరుగుతుంది?’ అని రాజకీయ పరిశీలకుడొకరు ప్రశ్నించారు. దళితుల కోసం చేపడుతున్న ఒక ఆదర్శ పథకాన్ని అడ్డుకోవాడానికి.. జాతీయ పార్టీగా చెప్పుకొనే బీజేపీ, దాని ప్రతినిధి రాజేందర్ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని ఆయన హితవు చెప్పారు. మిగతా అనేకానేక కేసీఆర్ పథకాల్లాగే దళితబంధు కూడా ఎక్కడ సక్సెస్ అవుతుందో, ఎక్కడ రేపటి సార్వత్రిక ఎన్నికలకు ఇది ఒక నమూనాగా మారుతుందో అని బీజేపీ నేతలు బెంబేలెత్తి ఈ పన్నాగానికి తెరలేపారని స్పష్టమైంది. ఒకవేళ దళితబంధు పథకం జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందితే, అసలే దళితవర్గాల్లో అపఖ్యాతి పాలై ఉన్న తమ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది బీజేపీ నేతల అసలు భయం.
దాచిన నల్ల డబ్బు చందాలుగా డైవర్ట్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా అడుగుతానని కొత్త స్టోరీ వినిపిస్తున్నారు. ఇదే రాజేందర్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారో అందరికీ తెలుసు. ‘ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తా’ అని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘ప్రజా బలంతో కాకుండా, జనాభిమానంతో కాకుండా పైసలతో ఎన్నికలు గెలుస్తానని రాజేందర్ ఆనాడే చెప్పారు. డబ్బుల్లేకపోతే ఆ మాట ఎలా చెప్పగలడు? అసలు విషయం ఏమిటంటే.. లోపలున్న డబ్బును బయటకు తెచ్చేందుకే ఈ ఎత్తుగడ. ఇదో కొత్త నాటకం. రాజేందరే తన పైసలను నమ్మకస్తులు కొందరికి పంచుతాడు. మళ్లీ వాళ్లే తనకు చందాలిచ్చినట్టు షో చేస్తాడు. తద్వారా తానేదో కష్టాల్లో ఉన్నట్టు, జనమే తనకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రచారం పొందడం ఆయన పన్నాగం. ఇందులో భాగంగానే ఆయన ఇంటికో వెయ్యి చందా అడుగుతా అన్నాడు. ఇదో ఎలక్షన్ జిమ్మిక్, చీప్ టాక్టిక్’ అని రాజేందర్‌కు దశాబ్దాలుగా సన్నిహితంగా మెదిలిన నాయకుడొకరు చెప్పారు. ఇదివరకటి ఎన్నికల్లో కూడా రాజేందర్ గంపగుత్తగా పైసలు పంచేవాడని, అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమని, ఈసారి కూడా రాజేందర్ జనాన్ని కాకుండా పైసలను నమ్ముకున్నాడని మరో నాయకుడు అన్నారు. తను దాచుకున్న కోట్ల రూపాయల డబ్బుని బయటకు తెచ్చే ప్రయత్నాల్లో భాగమే ఈ చందాల దందా అని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో తన ఓటమి ఖాయమని తేలడంతో రాజేందర్ ఈ సానుభూతి నాటకం మొదలుపెట్టినట్టు కూడా ఆయన వివరించారు. మొత్తానికి దళిత బంధు పథకం అటు విపక్షాల్లోనూ, ఇటు రాజేందర్‌కూ జడుపు జ్వరం పుట్టించింది. అందువల్లే ప్రేలాపనలు మొదలయ్యాయని పరిశీలకులు అంటున్నారు.