హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): యూరియా కొరత అనుకోకుండా వచ్చింది కాదా? కొరత వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసా? అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారా? అదే ఇప్పుడు రైతులకు శాపంగా మారిందా? ఈ ప్రశ్నలకు సోమవారం రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖ అవుననే సమాధానం చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విదేశాల నుంచి వచ్చే యూరియాను అధికంగా కేటాయించిందని, దీంతో కొరత తప్పదని ముందే గ్రహించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో యూరియా కొరత తప్పదనే విషయం మంత్రి తుమ్మలకు, అధికారులకు ముందే తెలుసనే విషయం స్పష్టమవుతున్నది.
అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కొరతకు సంబంధించి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు ఎవరికి వారే అనే చందంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. యథా రాజా తథ ప్రజా అన్నట్టుగా సీఎం, మంత్రి పట్టించుకోనప్పుడు అధికారులు సైతం అదే దారిలో పయనించారనే విమర్శలున్నాయి. అధికారులు ఢిల్లీ వెళ్లకుండా… జిల్లాలకు సరఫరాపైనే దృష్టి పెట్టడంతో ఎరువుల పంపిణీ అస్తవ్యస్థంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నెలకొన్న యూరియా సంక్షోభానికి, రైతుల గోసకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల పట్టింపులేకుండా వ్యవహరించడమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ నిల్వలు అడుగంటాయి. బఫర్ స్టాక్‌గా 4 లక్షల టన్నుల యూరియా ఉండాలి, కానీ లక్ష టన్నులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సమీక్షలు, లేఖల పేరుతో సీఎం, మంత్రి హడావుడి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక మార్క్‌ఫెడ్ నిర్లక్ష్యం మరో రకం. ఎరువుల సరఫరాలో కీలకంగా వ్యవహరించాల్సిన మార్క్‌ఫెడ్ అధికారులు అసలు యూరియాతో తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ‘యూరియా వస్తే లారీ పెట్టి పంపిస్తాం.. లేదంటే ఊరుకుంటాం’ అనేలా మార్క్‌ఫెడ్ అధికారులు వ్యవహరించడం గమనార్హం. సమావేశాల్లోనూ యూరియాతో తమకేం సంబంధం లేదని, అంతా వ్యవసా య శాఖదే బాధ్యత అనే విధంగా మార్క్‌ఫెడ్ అధికారులు వ్యవహరించినట్టు తెలిసింది. సీఎం, మం త్రులు, ఉన్నతాధికారులకే పట్టింపులేనప్పుడు.. తాము మాత్రం ఏం చేస్తామంటూ వ్యాఖ్యానించినట్టు తెలుస్తున్నది. గతంలో పదే పదే ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఇప్పుడెందుకు పోవడం లేదని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఈ విధంగా సీఎం, మంత్రి, అధికారుల నిర్లక్ష్యం, అల సత్వంతో యూరియా కొరత పట్టించుకునే నాథులు లేకుండాపోయారని, రైతులకు ఈ దుస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
యథా రాజా తథ ప్రజా అన్నట్టుగా యూరియా కొరతపై సీఎం, మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులూ అదే బాటలో నడిచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులపై అజామాయిషీ లేకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. సీఎం, మంత్రి నుంచి ఆదేశాలు లేకపోవడంతో అధికారులు సైతం యూరియా కొరతను పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి గతంలో కనీసం వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్లి రాష్ర్టానికి రావాల్సిన యూరియాపై ఢిల్లీ పెద్దలను కలిసి.. రాష్ర్టానికి రావాల్సిన కోటా వచ్చేలా లాబీయింగ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ అధికారి ఢిల్లీ వెళ్లేందుకే ఇష్టపడటం లేదని తెలిసింది. సీఎం, మంత్రుల నుంచి ఆ దిశగా ఆదేశాలు లేకపోవడంతో ఆయన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది.
చౌటకూర్, ఆగస్టు 26: ఎరువులు అందుబాటులో ఉంచకుండా అవగాహన సదస్సులు నిర్వహించడమేమిటని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిపై రైతులు మండిపడ్డారు. చౌటకూర్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ డ్రోన్ల సాయంతో వరి పైరుకు మందు పిచికారీ చేసుకోవాలని సలహా ఇచ్చారు. డ్రోన్లు సబ్సిడీపై అందజేయాలని రైతులు కోరారు. రైతుభరోసా డబ్బులతో కొనుక్కోవాలని శివప్రసాద్ చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు రైతుబంధు చాలా ఏండ్లుగా వస్తున్నదని తెలిపారు. ‘మీరు ఇచ్చేది ఏంది? మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా?’ అని నిలదీశారు. పంట వేసుకుని నెలదాటినా ఎరువులు ఇవ్వకుండా.. ఉచిత సలహాలు ఇవ్వడానికి సమావేశాలు నిర్వహిస్తే రైతులకు ఏమి ఉపయోగం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక అధికారులు నచ్చజెప్పడంతో గ్రామ రైతులు శాంతించారు.