హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్‌పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్… ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే, ఆయన అంకెల గారడి చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, రైతులకు చెల్లింపుల్లో వాస్తవాలు, గత రికార్డులను దాచేసి కేవలం వారికి అనుకూలమైన లెక్కలు ప్రదర్శించారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారనే విమర్శలొస్తున్నాయి.
వాస్తవం: ధాన్యం సేకరణలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట మార్చారు. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని ప్రకటించిన మంత్రి ఇప్పుడు 75 లక్షల టన్నులేనని చెప్తున్నారు. 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కోత పెట్టారు. ఒకవేళ 75 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే పరిస్థితేమిటి? ఎక్కువగా వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని పరోక్షంగా చెప్తున్నారా?
వాస్తవం: కాంగ్రెస్ సర్కార్ గత యాసంగిలో 74.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 75 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 60 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. కాగా, బీఆర్ఎస్ సర్కార్ 2020-21 యాసంగిలో 92.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అదీ నిండు కరోనా సమయంలో! ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ.. మరోవైపు లాక్డౌన్ పరిస్థితులు.. లారీల కొరత, హమాలీల కొరత ఇలా అన్నీ సమస్యలే. అయినప్పటికీ, రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డు స్థాయిలో 92.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది నాటి కేసీఆర్ సర్కార్. అలాంటిది ఇప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా, ఎలాంటి సమస్యలు లేకపోయినా 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నానా తంటాలు పడుతున్నది. 92.39 లక్షల టన్నుల కొనుగోలు వాస్తవాన్ని దాచేసి 75 లక్షల టన్నుల కొనుగోలే రికార్డు అని చెప్తుండటం గమనార్హం.

వాస్తవం : బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టుగా ఇక్కడ హమాలీ సమస్యకు పశ్చిమబెంగాల్ ఎన్నికలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముడిపెట్టారు. 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎంత లేబర్ అవసరం అవుతారనే ముందస్తు ప్రణాళిక లేదా? పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఒక్కరోజులోనే ప్రకటించి నిర్వహించారా? అక్కడ ఎన్నికలు ఉన్నాయని తెలిసినప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? కరోనా సమయంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి, ఇతర రాష్ర్టాల హమాలీలను తెలంగాణకు తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేయించింది. అలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ముందస్తు చర్యలు తీసుకోకుండా బెంగాల్ ఎన్నికలపై నెపం నెట్టడమేంటి?
వాస్తవం : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీఆర్ఎస్ పదేండ్లతో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలోనే అధికంగా చెల్లింపులు చేసినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రూ.1.35 లక్షల కోట్లు చెల్లిస్తే, కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో రూ.98,600 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. అయితే, వాస్తవానికి బీఆర్ఎస్ పదేండ్లలో రూ.1.55 లక్షల కోట్లు చెల్లించింది. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ఐదేండ్లపాటు రాష్ట్రంలో సాగునీటి కొరతతో వరి సాగైంది అంతంత మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, మిషన్ కాకతీయతో చెరువులు పూడికతీయడం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో 2019 నుంచి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు భారీగా పెరిగాయి.
కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం అన్నింటినీ కలిపి బీఆర్ఎస్పై బుదరజల్లే కార్యక్రమం చేస్తున్నది. 2014-15 నుంచి 2018-19 వరకు 2.33 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.37,178 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత ఐదేండ్లలో అంటే 2019-20 నుంచి 2023-24 వరకు 6 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.1.18 లక్షల కోట్లు రైతులకు చెల్లించింది. కాంగ్రెస్ సర్కార్ 2024-25లో రెండు సీజన్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ.29,713 కోట్లు చెల్లిస్తే మంత్రి ఉత్తమ్ మాత్రం రూ.36,146 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ఈ ఏడాది 2025-26లో రెండు సీజన్లలో కలిపి ఇప్పటివరకు రూ. 30వేల కోట్లు చెల్లిస్తే, మంత్రి మాత్రం రూ.39,359 కోట్లు చెల్లించినట్టు లెక్క చెప్పారు. ఇలా అబద్ధపు లెక్కలతో కొనుగోళ్ల వైఫల్యం నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవం : ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా కొనుగోళ్ల వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కొనుగోళ్ల లక్ష్యాన్ని తగ్గిస్తున్నదని చెప్తున్నారు. వాస్తవానికి, గడిచిన నాలుగైదు ఏండ్లుగా కేంద్రం ఇదే వైఖరిని అవలంబిస్తున్నది. అయితే నాడు బీఆర్ఎస్ సర్కార్.. తెలంగాణ రైతుల కోసం కేంద్రంపై పోరాటం చేసి.. ఢిల్లీలో ధర్నాలు చేసి రైతులకు అవసరమైన కోటాను సాధించుకొచ్చింది. కానీ, నేటి కాంగ్రెస్ సర్కార్ లేఖలు, ప్రెస్నోట్లు, వినతిపత్రాలతో సరిపెడుతూ.. కేంద్రం ఇస్తలేదని చెప్తున్నది. కేంద్రం లక్ష్యాన్ని తగ్గిస్తే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలదీయడంలేదు? ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నాలు చేయడంలేదు?
ధాన్యం కొనుగోళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆ తర్వాత కొనుగోళ్ల సమస్యలపై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు జంకినట్టు కనిపించింది. ఒకవైపు విలేకరులు ప్రశ్నలు అడుగుతుండగానే మంత్రి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయారు. కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తుచేస్తూ టీన్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. వాటిని దాటవేసే ప్రయత్నం చేశారు. టీన్యూస్ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.
రైతుగోస పేరుతో యాత్ర చేస్తున్న బీజేపీ నేతలు.. ఇక్కడ యాత్రలు మానేసి ఢిల్లీలో యాత్రలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఇది రైతుల గోస యాత్ర కాదేని, అధికార గోస యాత్ర అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్, తుమ్మల కలిసి పంట కొనుగోళ్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కొనుగోళ్లలో సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని తెలిపారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్ సరఫరా చేయలేని కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతుల గోస తీరుస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం డీజిల్ ధరలు పెంచి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. మద్దతు ధర ప్రకటిస్తూ కొనుగోళ్లు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నదని, రైతుల ఉసురు బీజేపీకి తగులుతుందని దుయ్యబట్టారు. కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రంలో రైతుల పండించే మక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు, సోయాబీన్ ఇలా అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కొనుగోలు చేస్తుందని చెప్పారు.
