హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ స్థలాలు సంస్థ, కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించకుండా ఇందిరమ్మ ఇండ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంప్లాయీస్ యూనియన్ శనివారం లేఖ రాసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలను కబళించాలని చూస్తున్నదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న మండిపడ్డారు. అనేక ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ స్థలాలపై కాంగ్రెస్ ప్రభుత్వ డేగ చూపు పడిందని విమర్శించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదని, ఆస్తులన్నీ కార్పొరేషన్‌కు చెందినవే తప్ప, ప్రభుత్వానికి చెందినవి కావని అన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్నటువంటి ఈ ఆస్తులను ధారాదత్తం చేయటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీలోనే ఇండ్లు లేని అనేకమంది పేద ఉద్యోగులు ఉన్నారని, అలాంటి ఉద్యోగులకు ఆర్టీసీ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల కోసం భూములను ఉపయోగించాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను కబళించాలని చూస్తే యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.