న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: టాటా సన్స్ కొత్త చైర్మన్ రేసులో ముగ్గురే తలపడుతున్నారు. 275 బిలియన్ డాలర్లకుపైగా విలువైన బహుళ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌నకు టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వం వహిస్తున్న సంగతీ విదితమే. 2017లో ఈ బాధ్యతల్లోకి వచ్చిన ఆయన రెండో విడుత ఐదేండ్ల టర్మ్ చేస్తున్నారు. అయితే గత నెలలో ఇక కొనసాగబోనని ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ఆయన ఉద్యోగ పదవీకాలం తీరిపోనున్నది. ఈ క్రమంలోనే నూతన సారథి కోసం అన్వేషణలు మొదలయ్యాయి. ఈ బరిలో టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్‌వో సౌరభ్ అగర్వాల్‌తోపాటు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ చౌహాన్ పేరు వినిపిస్తున్నది. నరేంద్రన్ ముందంజలో ఉన్నట్టు సమాచారం.
ఇవెకోపై టాటా మోటర్స్ కన్ను
ఇటాలియన్‌కు చెందిన కమర్షియల్ వాహన తయారీ సంస్థ ఇవెకోపై టాటా మోటర్స్ కన్ను పడింది. ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ను హస్తగతం చేసుకున్న టాటా..తాజాగా ఇటాలియన్‌కు చెందిన ఇవెకోను వాలంటరీ టెండర్ ఆఫర్ ఇచ్చింది. షేరుకు 14.10 యూరో చొప్పున ఒప్పందం విలువ 3.82 బిలియన్ల యూరోలు ఉంటుందని అంచనా. ఈ ప్రత్యేక ఆఫర్ టీఎంఎల్ సీవీ హోల్డింగ్స్ బీవీ ద్వారా అందిస్తున్నట్టు, దీనికి సబంధించిన అంగీకార గడువు ఈ నెల 7 నుంచి అక్టోబర్ 26 వరకు ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఒప్పందానికి ఇవెకో గ్రూపు బోర్డు డైరెక్టర్లు ఇప్పటికే ఆమోదముద్ర వేయగా, దీనికి కంపెనీకి చెందిన షేరు హోల్డర్లు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి వుంటుంది.