12 గ్రామాల ఓటర్లది ఏ రాష్ట్రం?
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు 70 ఏండ్లుగా రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ 12 గ్రామాల్లో ప్రతి ఓటరుకూ రెండేసి ఓట్లు ఉన్నాయి.
- రెండు రాష్ర్టాల్లోనూ వీరికి ఓటు ‘సర్’తో ఏదో ఒకచోట ఓటు హక్కు!
- తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో విచిత్ర పరిస్థితి
- ఏడు దశాబ్దాలుగా దొరకని పరిష్కారం
- సమస్యాత్మకంగా మిగిలిన గ్రామాల్లో సందిగ్ధం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు 70 ఏండ్లుగా రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ 12 గ్రామాల్లో ప్రతి ఓటరుకూ రెండేసి ఓట్లు ఉన్నాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు సమయంలో ఈ గ్రామాలను అటు మహారాష్ట్రకు- ఇటు అప్పటి ఆంధ్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణ)కు చెందినట్టుగా గుర్తించడంలో స్పష్టత లేని కారణంగా ఈ గ్రామాలు వివాదాస్పదంగా మిగిలిపోయాయి. ఈ గ్రామాల్లో రెండు రాష్ర్టాల పాలన కొనసాగుతున్నది. ఏడు దశాబ్దాలుగా ఇక్కడి ఓటర్లు ఇటు తెలంగాణలో, అటు మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ‘సర్’ కార్యక్రమం కొనసాగుతుండగా, ఈ వివాదాస్పద గ్రామాల ప్రజలు ఏ రాష్ర్టానికి చెందినవాళ్లు..! అనేది ఆసక్తికరంగా మారింది. ‘సర్’తో ఏదో ఒకచోట మాత్రమే ఓటు హక్కు పొందే అవకాశముండగా, ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఎలా చేస్తారన్నది సందేహంగా మారింది.
రెండు రాష్ర్టాల్లోనూ..
తెలంగాణ- మహారాష్ట్ర మధ్య సరిహద్దుల్లో సుమారు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పద గ్రామాలుగా మిగిలిపోయిన పరంధోళి, ముకద్ధంగూడ, అంతపూర్, పద్మావతి, మహారాజ్గూడా, కోటా, ఇంద్రానగర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరి, లెండిగూడ గ్రామాల్లో సుమారు 3 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. వీరందరికీ రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు వేర్వేరుగా ఓటరు ఐడీ కార్డులు జారీ చేశాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలన్నీ రెండేసి అందుతున్నాయి. అభివృద్ధి పథకాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలన్నీ రెండు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు ఇటు తెలంగాణకు, అటు మహారాష్ట్రకు చెందిన ఇద్దరేసి సర్పంచులు ఉన్నారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల విభజన సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ) పరిధిలోకి వచ్చాయి. భౌగోళికంగా, సాంస్కృతిక పరంగా తమకు దగ్గరగా ఉన్నాయనే కారణాలతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను చంద్రాపూర్ జిల్లాలోని జీవతి తాలుకాలో చేర్చింది.
70 ఏండ్లుగా వివాదం
ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ జరుగుతుండటంతో ఈ గ్రామాల్లో సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. కొంతమంది ఓటర్లు తెలంగాణలో, మరికొందరు మహారాష్ట్రలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ 12 గ్రామా ల్లో మరాఠీ మాట్లాడే దళితులు (ఎస్సీ), ఎస్టీలోని లంబాడా తెగకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా.. తెలంగాణలో ఎస్టీలుగా ఉండటంతో వారు తెలంగాణలో ఉండేందుకు ఆసక్తి చూపుతుంటే.. ఎస్సీలు మహారాష్ట్రలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ఆసక్తిచూపుతున్నట్టు తెలుస్తున్నది. ‘సర్’ ప్రక్రియతో మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో 70 ఏండ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఈ 12 గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోనికి వస్తాయనేది తేలుతుందో లేదో వేచిచూడాలి.
ప్రభుత్వాలే తేల్చాలి
మేము ఏ రాష్ర్టానికి చెందిన వాళ్లమో ప్రభుత్వాలే తేల్చాలి. ఇంతకాలం తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మా గ్రామాలు వివాదాస్పదంగా ఉండిపోవటంతో సరైన అభివృద్ధికి నోచుకోలేదు. రెండు రాష్ర్టాల్లోనూ కొనసాగాలని మేము కోరుకోవడం లేదు. రెండు రాష్ర్టాల మధ్య ఉండటం వల్ల సరైన అభివృద్ధి కూడా జరగలేదు. సదరు 12 గ్రామాల్లోని ఎస్టీలు తెలంగాణలో ఉండేందుకు ఆసక్తిచూపుతుండగా ఇతరులు మహారాష్ట్రలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
– సూర్యవంశి పరమేశ్వర్,బోలాపటార్, కెరమెరి మండలం
ఇప్పటివరకు ఎలాంటి సమస్య రాలేదు
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న ఈ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియ నిర్వహించటంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్య రాలేదు. సర్పై ఈ గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాం. అయినప్పటికీ కొంతమంది రెండుచోట్ల సర్ ఫారాలు నింపి ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ‘సర్’లో సేకరించిన వివరాలను ఆన్లైన్ చేసేటప్పుడు ఏదో ఒకచోట మాత్రమే ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉంటుంది.
– నాగార్జునగౌడ్, తహసీల్దార్, కెరమెరి
భూసమస్యలు పరిష్కరించే రాష్ట్రంలో ఉంటాం
మా గ్రామాల్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించే రాష్ట్రంలో మేము కొనసాగాలనుకొంటున్నాం. 1982 వరకు మేము సాగుచేసే భూములకు పహాణీలు ఇచ్చారు. ఆ తర్వాత దళితుల సాగులో ఉన్న భూములకు పహాణీలు ఇవ్వటం ఆపేశారు. మా భూ సమస్యల పరిష్కారం కోసం దాదాపు 50 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. మాకు భూములపై హక్కులు కల్పించే రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నాం.
– కాంబ్లే లక్ష్మణ్, పరంధోళి, కెరమెరి మండలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

