హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘ఆపరేషన్ రోలెక్స్’ సంచలనంగా మారింది. నిందితుడి ఇంటి నుంచి ఖరీదైన వాచ్‌ను కొట్టుకొచ్చిన అధికారి.. తన బాస్‌కు గిఫ్ట్ ఇచ్చి ప్రసన్నం చేసుకుందామని భావించాడట. కానీ కొట్టుకొచ్చిన వాచ్‌ను స్టేషన్లోనే మరో అధికారి తస్కరించాడట. ఈ విషయం బయటకు వచ్చింది. ఇందుకు కారణం.. నిందితుడి ఇంటి నుంచి రోలెక్స్ వాచ్ ఒక్కటే కాదు.. ఇంకా చాలా వస్తువులను పోలీసులు పట్టుకువచ్చారని తెలిసింది. దొరికిన విలువైన వస్తువులు దొరికినట్టు తీసుకొచ్చి… రిలాక్స్‌గా పంచుకునే క్రమంలో తేడాలు రావడంతోనే రోలెక్స్ సంగతి బయటకు వచ్చినట్టు సమాచారం.
ఇంతలో ఆ రోలెక్స్ స్టేషన్ నుంచే మాయం కావడం.. ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో ‘సార్’ సీరియస్ అయ్యారట. ఉన్నతాధికారులు ఒక్కొక్కరిని విచారించగా.. చోరీ చేసిన అధికారి దొరికాడట. ఈ వ్యవహారం హైదరాబాద్ కమిషనరేట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు సిబ్బంది ఎదురుపడ్డా ‘రోలెక్స్ దొరికిందా?’ అని కొందరు, ‘రోలెక్స్ దొరికిందట కదా!’ అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఉన్నతాధికారికి రోలెక్స్ వాచ్ ఇష్టమట. ఇదే విషయాన్ని తాను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారట. దీంతో సార్‌కు తమకు లభ్యమైన రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌గా ఇద్దామని కొందరు అధికారులు భావించారు. ఆ రోలెక్స్ వాచ్ ఎక్కడిదంటే… ఇటీవల నకిలీ ఐఏఎస్‌గా చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలువైన వస్తువులను కొందరు పోలీసు అధికారులు తస్కరించినట్టు తెలిసింది. అక్కడ రోలెక్స్ వాచ్ కనిపించడంతో.. దాన్ని సార్‌కు గిఫ్ట్‌గా ఇద్దామని ఫిక్స్ అయ్యారట. అదీ సంగతి. ఇక స్టేషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఆ వాచ్‌ను ఎవరో మాయం చేశారని తెలిసింది.
సుమారు రూ.25 లక్షల విలువైన వాచ్ ఏమైందో ఎవరికీ అంతుపట్టలేదు. నిందితుడి ఇంటి నుంచి రోలెక్స్ వాచ్ కొట్టేశారంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనమైంది. దీంతో ఉన్నతాధికారులపై ‘సార్’ చీవాట్లు పెట్టారట. కమిషనరేట్ పరువు తీశారంటూ క్లాస్ పీకారట. ఆ వాచ్ ఏంటో.. దాని సంగతేంటో తేల్చండని ఆదేశించారట. దీంతో అధికారులు.. తనిఖీల కోసం వెళ్లిన వాళ్లను ఒక్కొక్కరినీ విచారించారని, ఓ అధికారి దగ్గరే ఆ వాచ్ ఉన్నట్టు తేలిందని సమాచారం. నిజంగానే రోలెక్స్ వాచ్ అంటే ముచ్చటపడే సార్‌కు ఇద్దామని దాచినట్టా? లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకుందామనే తీసుకున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు.