క్లైమాక్స్‌కు ఆపరేషన్ పోచమ్మ మైదాన్..
ఒకటెనుక ఒకటి దూసుకొచ్చి… దుకాణాలు నేల మట్టం చేసి…
తండోపతండాలుగా తరలివచ్చిన జనాలు…
భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
ఖని చౌరస్తాలో 20 కి పైగా భవనాల కూల్చివేతలు…
Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 19: గోదావరిఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారి గా అలజడి రేగింది… బులడోజర్ ఒకటెనుక మరొకటి దూసుకొచ్చింది.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప్రజలు చూస్తుండగానే భవనాలను నేలమట్టం చేసింది.
గోదావరిఖని నగరం నడిబొడ్డున మంగళవారం జరిగిన ఈ సంఘటన అందరిని భయకంపితులను చేసింది. ఒకవైపు పోలీస్ బలగాలు… మరోవైపు బుల్డోజర్లు.. అసలు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ శబ్దాలతో భవనాలు ఒక్కసారిగా నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలు చూసేందుకు గోదావరిఖని నగరం పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలి వచ్చారు. ఆందోళనకారులను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కట్టడి చేసేందుకు అష్ట కష్టాలు పడ్డారు. సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోదావరిఖని నగరం ప్రధాన చౌరస్తాలోని రామగుండం నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా 39 గుంటల స్థలంలో ఉన్న వివాదాస్పద భవనాలు గా పేర్కొంటూ మంగళవారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ లో భాగంగా గతంలోనే పలు దుకాణాలను నగరపాలక సంస్థ, సింగరేణి సంస్థ అధికారులు సమన్వయంతో కూల్చివేశారు. మిగతా భవనాలను కూడా తొలగించేందుకు ప్రయత్నం కోర్టు పరిధిలో ఉండడంతో అక్కడితో ఆగిపోయారు.
ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు ఆదేశాలతో ఇక్కడి పోచమ్మ మైదాన్ లోని భవనాలను అధికారులు సర్వే చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మళ్లీ అధికారులు రంగంలోకి దిగారు. షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్ని భవనాలను ప్రజలంతా చూస్తుండగానే కూల్చివేత చర్యలు చేపట్టారు. దాదాపు 6 జెసిబి వాహనాలను రంగంలోకి దింపారు. అప్పటిదాకా దుకాణాలలో ఉన్న వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు భారీగా మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దుకాణాలలో ఉన్న సామాగ్రిని సంబంధిత వ్యాపారులు బయటకు తీసుకు వెళుతుండగానే మరోవైపు జెసిబి లతో భవనాలను కూల్చి వేశారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండానే భవనాలను తొలగిస్తుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 20 కి పైచిలుకు భవనాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. ఈ కూల్చివేతలు బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కూల్చివేత చర్యలతో అటు వ్యాపారులు.. ఇటు నగర ప్రజలు హడలెత్తిపోయారు. ఈ చర్యలతో నగర చౌరస్తాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.