Operation Pochamma Maidan | కోల్‌సిటీ, ఆగస్టు 19 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ‘ఆపరేషన్ పోచమ్మ మైదాన్’ రణరంగంగా మారింది. బుల్డోజర్లు ఒకటెనుక మరొకటి దూసుకొచ్చి.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప్రజలు చూస్తుండగానే భవనాలను నేలమట్టం చేశాయి.
నగరం నడిబొడ్డున మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని రామగుండం నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా 39 గుంటల స్థలంలో ఉన్న భవనాలను వివాదాస్పదమైనవిగా పేర్కొంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు ఆరు ఎక్స్కవేటర్లను రంగంలోకి దింపారు. వ్యాపారులు అడ్డుకునే యత్నం చేయగా ఖని వన్‌టౌన్ పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దుకాణాల్లో ఉన్న సామగ్రిని సంబంధిత వ్యాపారులు బయటకు తీసుకువెళ్తుండగానే మరోవైపు బుల్డోజర్లు 20కి పైగా భవనాలను కూల్చివేశాయి.
ఈ విషయమై రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీని వివరణ కోరగా.. పోచమ్మ మైదానంలోని సింగరేణి సంస్థ పరిధికి చెందిన 39 గుంటల స్థలంలో ప్రైవేట్ నిర్మాణాలను తొలగించాలని కోరడంతోనే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 20 ఏండ్ల క్రితం గోదావరిఖనికి చెందిన ఏడుగురు వ్యక్తులు పోచమ్మ మైదానంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, సింగరేణి సంస్థ నోటీసులు జారీ చేసింది. దీంతో సదరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ స్థలంపై సమగ్ర సర్వేకు ఆదేశాలు జారీ చేయగా, సోమవారం అధికారులు ఇరు పార్టీల సమక్షంలో సర్వే చేసి వెళ్లారు. ఈ క్రమంలోనే సింగరేణి, రామగుండం కార్పొరేషన్ అధికారులు భవనాల తొలగింపునకు ఉపక్రమించారు.