హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో వామపక్ష శక్తులు బలహీనపడటంతో మతోన్మాద బీజేపీ చెలరేగిపోతున్నదని, దీనిని కట్టడి చేయడానికి కమ్యూనిస్టులు మరింతగా బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీకి ఆధికార దాహం తప్ప.. దేశంపై కానీ, ప్రజలపై కానీ ఎలాంటి ప్రేమ లేదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో జరిగాయి. సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.