ఉస్మానియా యూనివర్సిటీ, మే 10: ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానం ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్‌లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్2, డీఎస్సీ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో, టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు, గ్రూప్1 ప్రిలిమ్స్ జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జూన్ 24న, డీఏవో జూన్ 30న, డీఎస్సీ పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో ఉన్నాయని గుర్తు చేశారు.
పై అన్ని పరీక్షలకు అర్హులమైన తాము ఈ తేదీల కారణంగా సరైన రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే విధమైన సిలబస్ ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని వాపోయారు. ఈ వ్యవధిలోనే గ్రూప్ 1 మెయిన్స్, డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలకే పోటీపడతారని చెప్పారు. కనుక నిరుద్యోగల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా తేదీలను మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు.