హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్నివర్గాలు సుసంపన్నంగా ఎదుగాలనే లక్ష్యంతో కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేశారు. వేలకోట్లు వెచ్చించి ఆర్థికాభ్యున్నతికి బాటలు వేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం సమున్నతంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు మహానగరంలో విలువైన స్థలాలు కేటాయించారు. ఇందులో భాగంగా కురుమల ఆత్మగౌరవానికి ప్రతీకగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో దొడ్డి కొమురయ్య పేరిట కురుమ ఆత్మగౌరవ భవనం నిర్మించాలని సంకల్పించారు.
సకల హంగులతో భవన నిర్మాణం..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో కురుమ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో రూ.500 కోట్ల ఖరీదైన ఐదెకరాల స్థలం కేటాయించి, రూ.5 కోట్లు మంజూరు చేశారు. కులపెద్దల సూచనల మేరకు భవనాన్ని డిజైన్ చేశారు. మళ్లీ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమై 2024లో సకల హంగులతో భవనాన్ని పూర్తి చేశారు. అధికారంలోకి రాగానే కులసంఘాల భవనాలకు నిధులు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది తర్వాత కురుమ సంఘ భవనానికి ప్రహరీ నిర్మించి శనివారం ఈ భవనాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఇది తమ ఘనతగా చెప్పుకోవడంపై సభకు వచ్చినవారు విస్మయం వ్యక్తంచేశారు. రూ.500 కోట్ల విలువైన స్థలం కేటాయించిన కేసీఆర్ను మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.