Harish Rao | కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు కానీ అన్ని స్కామ్‌లే జరిగాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెసోళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని.. ఓట్లు అయిపోతే మాయమవుతారని అన్నారు. కానీ బతుకమ్మ, దసరా, రంజాన్, బక్రీద్, క్రిస్మస్.. ఇలా ఏ పండుగైనా, కష్టమైనా నిరంతరం మీ మధ్య ఉంటూ మీ అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్ల కోసం సైకిల్‌కు అటొక బకెట్, ఇటొక బకెట్ కట్టుకొని ట్యాంకర్ల వెంట పడేవాళ్లమని గుర్తుచేశారు. వారానికి, ఐదు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టాక ఇప్పుడు సిద్దిపేటలో రోజూ ఇంటింటికీ మంచినీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వడానికి 8 వేల కోట్లతో లైన్లు వేస్తున్నారు, కానీ మన సిద్దిపేటలో మాత్రం ఎప్పటినుంచో కాళేశ్వరం, మల్లన్న సాగర్ నీళ్లు తాగుతున్నామని పేర్కొన్నారు. వార్డులో 90-95 శాతం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మిగిలినవి కూడా పూర్తి చేసుకుందామని అన్నారు
సిద్దిపేటను జిల్లాగా మార్చుకున్నామని హరీశ్‌రావు అన్నారు. మనుషుల డాక్టర్, పంటల డాక్టర్, పశువుల డాక్టర్.. ఇలా అన్ని రకాల వైద్య విద్యలను మెడికల్, నర్సింగ్, బి-ఫార్మసీ, డైట్ కాలేజీలు సిద్దిపేటకే తెచ్చుకున్నామని తెలిపారు. టీవీల్లో, సినిమాల్లో మాత్రమే చూసిన రైలును ఇవాళ సిద్దిపేట దాకా తీసుకొచ్చి మన కల సాకారం చేశామని తెలిపారు. పట్టణం చుట్టూ రెండు రింగ్ రోడ్లు వేసుకున్నామని.. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, దాని వెనుక ధ్యాన మందిరం, అన్నదాన సత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
మైనార్టీ సోదరుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట పిల్లలు చదువుకోవాలని నేను పశువుల డాక్టర్ కోర్సుతెస్తే, సగం కట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా దాన్ని కొడంగల్ కు ఎత్తుకుపోయాడని మండిపడ్డారు. నా సిద్దిపేట పిల్లల నోటికాడ బుక్క లాక్కున్నాడని అన్నారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ తిరుగుతున్నారో వాళ్లకే తెలియాలని ఆగ్రహం వ్యక్తం చేశారు
కోమటి చెరువును నెక్లెస్ రోడ్లా మార్చుకున్నామేని.. బోట్లు, లైట్లు, పిల్లల ఆట వస్తువులు పెట్టుకున్నాం. సిద్దిపేట జనాలు ఎక్కడికో హైదరాబాద్ పోవద్దు అని నేను ఇక్కడే శిల్పారామం కడితే.. కాంగ్రెస్ వాళ్లు వచ్చి సగంలోనే ఆపేశారని అన్నారు. రంగనాయక సాగర్ దగ్గర టూరిస్ట్ ప్లేస్ పనులు కూడా ఆపేశారు. సిద్దిపేట అభివృద్ధిని వాళ్లు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు కానీ, అన్నీ స్కామ్‌లే ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వక చదువులు ఆగం చేశారని అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు బోడి గుండు చూపించారని మండిపడ్డారు. ఈ స్కామ్‌ల ప్రభుత్వం పోవాలి, మళ్లీ మన స్కీమ్‌ల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారు, ఓట్లు అయిపోతే మాయమవురని అన్నారు.. కానీ బతుకమ్మ, దసరా, దేవీ నవరాత్రులు, రంజాన్, బక్రీద్, క్రిస్మస్.. ఇలా పండుగైనా, కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉంటూ మీ ఇంట్లో అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు