Lagacharla | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : నిజం గడపదాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్న చందంగా లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ఈ కేసులోకి లాగారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొన్న పట్నం నరేందర్‌రెడ్డి, బీ సురేశ్ మధ్య 84 సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ, దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తుండగా.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ మరో విధంగా ఉన్నది. సంఘటన జరిగిన రోజున బీ సురేశ్ ఒకే ఒక్కసారి పట్నం నరేందర్‌రెడ్డితో సంభాషించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పోలీసులు పక్కా ఫ్లాన్‌తో సురేశ్‌కు, నరేందర్‌రెడ్డికి మధ్య నాయకుడు, కార్యకర్తగా ఉన్న సంబంధాన్ని అడ్డంగా పెట్టి కుట్రగా చిత్రీకరించారు. ప్రభుత్వం కొన్నాళ్లుగా బాంబు పేలుతుందంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో కేటీఆర్ పేరును ప్రస్తావించడం వెనుక ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అధికారులపై దాడి జరిగిన రోజున సురేశ్, నరేందర్‌రెడ్డితో 84 సార్లు మాట్లాడాడని, వీరిద్దరూ కలిసి కుట్ర చేశారంటూ కాంగ్రెస్ పార్టీ, దాని అనుకూల మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ ఘటనలో సురేశ్‌ను ముందుంచి, నరేందర్‌రెడ్డి వెనుక నుంచి కథ నడిపించారంటూ లేనిపోని కథలు అల్లారు. రిమాండ్ రిపోర్టులో సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ మధ్య మొత్తం 72 రోజుల్లో 84 సార్లు సురేశ్, నరేందర్‌రెడ్డి మధ్య సంభాషణలు జరిగినట్టు పేర్కొన్నారు. ఇక అధికారులపై దాడి జరిగిన నవంబర్ 11న ఒకే ఒకసారి ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు వెల్లడించారు. సంఘటన జరిగిన రోజు ఒక్కసారి మాట్లాడినంత మాత్రన దానిని 84 సార్లు మాట్లాడినట్టు సీన్ క్రియేట్ చేశారు.
భూములు కోల్పోతున్న బాధితులతో పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడటాన్ని పోలీసులు కుట్రగా పేర్కొన్నారు. ఆయన రిమాండ్ రిపోర్టులో.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై కర్రలు, రాళ్లతో లేదంటే కారంపొడితో దాడులు చేయాలని, వారి ఉద్దేశ్యంలో అధికారులను హత్య చేసి, తమ భూమిని కాపాడుకునే విధంగా కుట్ర చేశారంటూ పోలీసులు పేర్కొన్నారు. రైతులను, గ్రామస్థులను దాడులకు ప్రోత్సహించింది నరేందర్‌రెడ్డి అని తెలిపారు. ప్రణాళికలో భాగంగానే సురేశ్ కలెక్టర్‌తో మాట్లాడి ఆయనను గ్రామస్థులు ఉన్న చోటికి తీసికెళ్లి, దాడి చేయించి తమ ప్లాన్‌ను అమలు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే కుట్రతోనే అధికారులపై దాడికి పాల్పడ్డామని, దీని ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించామని, తమ పార్టీ నాయకుడు కేటీఆర్, ఇతర నాయకుల ఆదేశాలతోనే ఈ కుట్ర చేశామంటూ నరేందర్‌రెడ్డి తమ విచారణలో అంగీకరించారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదంతా ప్రభుత్వం అల్లుతున్న కట్టుకథ అని తెలిసినప్పటికీ దానికి కుట్ర రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతున్నది.