TS Minister Gangula | ప్రజల పట్ల ప్రేమకు చిహ్నం గులాబీ జెండా అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ప్రజలు ఊహించుకొరని, అసత్య ప్రచారం నమ్మొద్దని అన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌కు ఓటేయడానికి సిద్ధమయ్యారన్నారు. కరీంనగర్‌లోని స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలు, బూత్ ఇంచార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజలంతా కేసీఆర్ కు ఓటేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కేసీఆర్ ఆలోచనలను ముందు చూపును ప్రతీ కార్యకర్త ప్రజలకు వివరించాలని కోరారు.
కేసీఆర్ తెలంగాణను కాపాడే శక్తి అని, కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి, ఊరికి బొడ్రాయిని కాపాడుకున్నట్లే, సీఎం కేసీఆర్‌ను కాపాడుకుంటారని, ఆయన్ను వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంత్రి గంగుల పేర్కొన్నారు. 50 ఏండ్ల దరిద్రాన్ని చూసిన ప్రజలు పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కొనసాగించాలని భావిస్తున్నారని అన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని ఓట్ల శాతం పెంచే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ రూపంలో హైదరాబాద్‌లో ఆంధ్రోళ్లు పాగా వేశారని, వారు పట్ల తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఆంధ్ర నాయకులకు ఇవే చివరి ఎన్నికలని, ఈ ఎన్నికలు కాగానే ఉమ్మడి రాజధాని గడువు పూర్తయి ఇక ఇక్కడకు రారని అన్నారు.
`15 రోజులు నా కోసం కష్టపడితే…ఐదేళ్లు నా రక్తం ధారబోసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను` అని కార్యకర్తలు, బూత్ ఇన్‌చార్జీలకు మంత్రి గంగుల హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం కార్యకర్తలే అని అన్నారు. `మీరే మా బలం.. మీరే మా బలగం` అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇప్పిచింది బండి సంజయ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిలదొక్కుకునే పరిస్థితి లేదని అన్నారు.
నగరంలోని 32వ డివిజన్ కట్ట రాంపూర్ వాసి అయిన బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంజయ్‌పై ఉన్న అభిమానంతో తన చేతిపై సంజయ్ పచ్చ బొట్టు కొట్టించుకున్నానని, తన వంటి వారికి పట్టించుకునే పరిస్థితిలో సంజయ్ లేరని అన్నారు. కేవలం యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకుని అవసరం తీరాక వదిలేయడం సంజయ్ నైజం అని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంకటేష్ తో పాటు యువకులు నరేందర్, మహేష్, ప్రవీణ్ తో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.