Rajiv Yuva Vikasam | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఊరించిన రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఊసూరుమనిపిస్తున్నది. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడమేగాక, రేషన్‌కార్డు ఉంటేనే పథకానికి అర్హులని సర్కారు షరతులు విధించడమే అందుకు కారణం. మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేయడంతోపాటు, ఆపై సదరు జిల్లా మంత్రి ఆమోదం పొందితేనే రుణాలలు మంజూరయ్యేలా నిబంధనలు రూపొందించింది. మరోవైపు ఇప్పటికే రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించి, జూన్ 2లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తామని సర్కారు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే.
ఈ పథకాన్ని రేషన్‌కార్డుతో సర్కారు ముడిపెట్టింది. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయం సర్టిఫికెట్‌ను పెట్టాలని సూచించింది. అయితే ఆదాయ సర్టిఫికెట్ జారీకి రెవెన్యూ అధికారులు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే బీసీ బంధు, మైనార్టీ బంధు, ట్రైకార్, తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఆయా వర్గాలకు చెందినవారు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. అన్ని కలిపి దాదాపు 7-8 లక్షల దరఖాస్తులు ఉంటాయని అంచనా. అయితే ప్రస్తుతం వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఆన్లైన్లో ఆధార్‌కార్డు నెంబర్ ఎంట్రీ చేయగానే, ఇప్పటికే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అప్లికేషన్ తిరస్కరణకు గురవుతున్నది. మరోవైపు సర్కారు ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారో, లేదో స్పష్టతనివ్వలేదు.