హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో ఇప్పటి వరకు కేవలం 39,101 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఈ విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో సీట్లు కన్ఫర్మ్చేశారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లను ఈ నెల 14న కేటాయించారు. మొదటి విడతలో 56,147 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, కేవలం 39,101 మంది విద్యార్థులు మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. అంటే 17,046 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నా వదులుకున్నారు.
దీంతో ఈ 17వేల సీట్లు ఖాళీ అయినట్టే లెక్క. దోస్త్ రెండో విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో విడతలో 46,504 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 45,337 మంది దరఖాస్తులు పూరించారు. మొదటి విడతలో సీటు వచ్చిన వారితోపాటు, రెండో విడత దరఖాస్తు చేసుకున్న వారు కలిపితే 60,441 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. మొదటి విడతలో సీట్లు వచ్చినవారు సంతృప్తికరంగా లేకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొన్నారు.
వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 26న ముగిసింది. ఈ నెల 30న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. డిగ్రీ ఫస్టియర్లో మొత్తం 3,60,709 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 39,101 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 3,21,608 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్లో కేవలం 10% సీట్లు మాత్రమే భర్తీకాగా, 90% సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండో విడతలో 50వేల లోపు విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏటా రెండు లక్షల సీట్లు నిండుతుండగా, ఈ సారి రెండు లక్షల మార్కును దాటేనా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.