(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగా): గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, గుజరాత్‌కు చెందిన 29 జిల్లాల్లో గత రెండేళ్లలో 2,38,978 మంది ఉన్నత విద్య చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. గుజరాత్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు రాగా, అందులో 22 మంది అహ్మదాబాద్ వాసులు, మరో 9 మంది భావ్‌నగర్ వాసులు కాగా, ఒకరు గాంధీనగర్ వాసి. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అత్యధికంగా ఆనందనగర్ నుంచి 21,633 మంది నిరుద్యోగులు ఉన్నారు.