Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ రూపంలో దక్కింది తక్కువే అయినా, ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుల నుంచి ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటివరకు 31 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో సన్నధాన్యం తొమ్మి ది లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. ఇందుకు రైతులకు చెల్లించిన బోనస్ కేవలం రూ.251 కోట్లు. ఈ మాత్రం దానికే ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ప్రచారం చేసుకోవడం గమనార్హం. మిగిలిన 22 లక్షల టన్నుల ధాన్యం దొడ్డరకం కావడంతో దానికి ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదు. సివిల్ సైప్లె కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 71% ధాన్యానికి బోనస్ దక్కలేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో కేవలం 29% ధాన్యానికే బోనస్ ధర లభించడం గమనార్హం.
సన్నాల అంచనాలు తలకిందులు
సన్నధాన్యం సేకరణపై సివిల్ సైప్లె అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. బోనస్ ప్రకటనతో భారీగా సన్నాల సాగు పెరిగిందని, భారీ మొత్తంలో సన్నాల దిగుబడి వస్తుందని అధికారులు చెప్తూ వచ్చారు. ఈ సీజన్లో 48 లక్షల టన్నుల సన్నాలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇంత భారీ మొత్తంలో సన్నాలను కొనుగోలు చేస్తున్నాం కాబట్టి రైతులకు భారీ మొత్తంలో బోనస్ వస్తుందని మంత్రి పలుమార్లు పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ అధికారులకు, మంత్రులకు వాస్తవం బోధపడింది. ఆశించిన స్థాయిలో సన్నాలు వచ్చే అవకాశం లేదని అర్థమైంది. దీంతో సన్నాల కొనుగోలు లక్ష్యాన్ని 48 లక్షల నుంచి 35 లక్షలకు తగ్గించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 9 లక్షల టన్నులు సన్నాలు కొనుగోలు చేయగా, మరో 7-8 లక్షల టన్నులు వస్తుందని భావిస్తున్నారు. ఈ లెక్కన ఈ సీజన్లో సన్నాల కొనుగోలు మొత్తంగా 15 లక్షలకు మించకపోవచ్చనే అభిప్రాయాన్ని సివిల్ సైప్లె అధికారులు వ్యక్తంచేస్తున్నారు.
మిల్లర్లు కొన్నది 25 లక్షలు.. సర్కారు కొన్నది 9 లక్షలే
సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. వాటిని కూడా సరిగ్గా కొనుగోలు చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా సన్న ధాన్యం ప్రైవేటు మార్కెట్‌కు తరలివెళ్లేలా అధికారులు ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేశారని తెలిసింది. ఎప్పుడో అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆదిలో తాత్సారం చేసింది. నవంబర్‌లో మాత్రమే కొనుగోళ్లను వేగవంతం చేసింది. అప్పటికే రైతులు తాము పండించిన సన్న ధాన్యంలో అధిక భాగం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు విక్రయించారు. ఇప్పటివరకు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు సుమారు 25 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రైవేటు వ్యాపారులు అంత భారీ మొత్తంలో కొనుగోలు చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, బోనస్ భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘దొడ్డు’ రైతులకు ఎగనామం
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత సన్న ధాన్యానికి మాత్రమే అదీ ఎంపిక చేసిన రకాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని షరతు పెట్టింది. దీంతో తెలంగాణలో ఎక్కువగా పండే దొడ్డు రకాలకు బోనస్ దక్కడం లేదు. సన్నాలకు బోనస్‌తో తమకు పెద్దగా ఒరిగేదేమి లేదని రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.