హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ టీచింగ్ దవాఖానల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న చోట కనీసం రెండేండ్ల సర్వీస్ పూర్తయినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని, బదిలీపై వెళ్లేవారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పా టు చేసిన 17 మెడికల్ కాలేజీలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. దీంతో ఆయా కాలేజీల్లో బోధన సిబ్బంది కొరత తీరనున్నది. ఒకే పోస్టుకు ఒకరికన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని, అంతకుముందే అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు జరగాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం వైద్యాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
నెలరోజుల్లోపు ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ‘ఆరోగ్య తెలంగాణ’ను సాకారం చేసేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు సంఘం అధ్యకుడు అన్వర్, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల, కార్యదర్శి జలగం తిరుపతిరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బదిలీల్లో నిపుణులైన వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త మెడికల్ కాలేజీలకు వెళ్లే సౌలభ్యం కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
బదిలీలకు మార్గదర్శకాలు..