హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని.. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సర్కార్ విస్మరిస్తున్నది. ఓ వైపు పెండింగ్ బకాయిలు ఎక్కడికక్కడే పేరుకుపోగా.. బడ్జెట్లో చాలీచాలని నిధులే కేటాయించి ఉసూరుమనిపించింది. ఈ పథకానికి భారీగా కేటాయింపులు చేస్తారని భావించగా, ఉన్న బకాయిల కంటే తక్కువే కేటాయించడంపై నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,143 కోట్లు మాత్రమే కేటాయించడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచిన ఘనత తమదేనని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు వీలు చిక్కినప్పుడల్లా ఊదరగొడుతుంటారు.
కానీ, ఇంతటి ప్రతిష్టాత్మక పథకానికి అరకొర నిధులు విదిల్చి కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకొన్నదనే విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించిన నెట్వర్క్ దవాఖానలకు ఇప్పటి వరకూ రాష్ట్ర సర్కార్ రూ.1,200 కోట్ల వరకు బకాయిలు పడింది. తాజా కేటాయింపులైన రూ.1,143 కోట్ల నిధులు ఆ పెండింగ్ బకాయిలకే సరిపోవని, నెలనెలా తాము చేసే సేవలకు నిధులెలా? అంటూ నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు ఈహెచ్ఎస్ పథకం కింద ప్రతినెలా జీతం నుంచి 1.5 శాతం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసి ఖజానా నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏడాదికి దాదాపు రూ.1,500 కోట్లు వసూలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ నిధులనే ఆరోగ్యశ్రీకి మళ్లించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ పథకానికి అరకొర నిధులు కేటాయించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.