న్యూఢిల్లీ, జూన్ 11: ఎన్నికల ముందు వరకు అదుపులో ఉన్న ఉల్లిగడ్డల ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. కొద్ది రోజుల్లో రాబోతున్న బక్రీద్ వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఇటీవల వరకు కేంద్రం తీసుకున్న కొన్ని చర్యల కారణంగా ఉల్లిగడ్డల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే వాటిని సడలిస్తుందన్న ఆశతో కొందరు వ్యాపారులు పెద్దయెత్తున స్టాక్‌ను నిలువచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంది.
మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లి మార్కెట్లో సోమవారం సాధారణ రకం ఉల్లిగడ్డలు కిలో ధర రూ.26 ఉంది. ఇదే ఉల్లిగడ్డల ధర మే 25న రూ.17 ఉంది. అదే నాణ్యమైన ఉల్లి కిలో రూ.30 వరకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధిస్తున్న సుంకాలను త్వరలోనే రద్దు చేస్తుందన్న వార్తలతో వ్యాపారులు ఉల్లిని పెద్దయెత్తున నిల్వ ఉంచడంతో డిమాండ్‌కు సప్లయికి మధ్య వ్యత్యాసం పెరిగి ధరలు పెరుగుతున్నాయని కొందరు ఆర్థిక నిపుణులు తెలిపారు.