ఆ ఊరు మారింది.. వైకుంఠధామంతో సామాజిక మార్పు.. సగర్వంగా అంతిమ సంస్కారాలు
ఒక వైకుంఠధామం.. అనేక కులాల ఆలోచనలను మార్చి వేస్తున్నది. సామాజిక సంస్కరణలకు పురుడుపోస్తున్నది.
- వైకుంఠధామంతో సామాజిక మార్పు
- సగర్వంగా అంతిమ సంస్కారాలు
- ఖననం లేని గ్రామంగా పెగడాపల్లి
- దహనాలకే ఊరుమ్మడి నిర్ణయం
- అదే బాటలో పలు గ్రామాలు
బోధన్, డిసెంబర్ 19: ఒక వైకుంఠధామం.. అనేక కులాల ఆలోచనలను మార్చి వేస్తున్నది. సామాజిక సంస్కరణలకు పురుడుపోస్తున్నది. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాల్లో పెనుమార్పులు తెస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాలు.. ధనిక, పేద, ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భౌతికకాయానికి కడపటి వీడ్కోలును సగౌరంగా పలికే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు అంతిమసంస్కారాలను నిర్వహించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాల్లో సైతం ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయాయి. స్మశానానికి వెళ్లే దారి లేక, కాడె దింపే స్థలం లేక అనేక అవస్థలు పడ్డ ప్రాంతాల్లోనూ అలాంటి దయనీయ పరిస్థితులు కనుమరుగయ్యాయి. అంతిమ సంస్కారానికి అవసరమైన కట్టెలు, స్నానాలు చేయడానికి నీళ్లు, బాత్రూంలు, బోర్లు పనిచేయడానికి కరెంటు, కర్మకాండలకు అనువైన వేదికలు ఇలా అన్నీ సౌకర్యాలతో పల్లెల్లో వైకుంఠధామాలు రూపుదిద్దుకున్నాయి.
వైకుంఠధామాల నిర్మాణంతో గ్రామాల్లో ఖననాల సంఖ్య తగ్గి దహనాల సంఖ్య పెరుగుతున్న దృశ్యం అనేక గ్రామాల్లో ఆవిష్కృతమవుతున్నది. ఇప్పటివరకు మృతదేహాలను ఖననం చేసే సంప్రదాయాన్ని అనుసరించిన అనేక కులాలవారు దహనం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతిమ సంస్కారాల్లో విభిన్న సంప్రదాయాలను అనుసరించే అన్ని కులాల వారిని వైకుంఠధామాలు ఆకర్షిస్తున్నాయి. వారి మధ్య ఐక్యతను, సహానుభూతిని పెంపొందిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ పెగడాపల్లి గ్రామం. మృతదేహాలను పూడ్చిపెట్టడం వల్ల విలువైన భూములు తరిగిపోవడం, స్థలాలు చాలకపోవడం, దీంతో ఒకసారి మృతదేహాన్ని పూడ్చిన స్థలంలోనే మళ్లీ మళ్లీ మృతదేహాలను పూడ్చాల్సిన పరిస్థితులు తలెత్తడం ఇలాంటి అనేక సమస్యలను అధిగమించేందుకు దహనం వైపు మొగ్గుచూపుతున్నామని పలు కులాలవారు చెప్తున్నారు. వైకుంఠధామాల్లో ఉన్న వసతులు కూడా తమ ఆలోచనలను మార్చి వేస్తున్నాయని వివరిస్తున్నారు.
ఖననం లేని గ్రామం!
అది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామం. అనేక కులాల సమాహారం. మొత్తం జనాభా 3,500 మంది. గ్రామంలోని దాదాపు 14 కులాల్లో మృతదేహాలను ఖననం చేసే సంప్రదాయం ఉన్నది. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ కులాలవారు మృతదేహాలను దహనం చేస్తుండగా, గ్రామంలోని మిగిలిన కులాలైన ముదిరాజ్, పద్మశాలి, మాల, మాదిగ, గోసంగి, రజక, మంగలి, కురుమ తదితరులు మృతదేహాలను ఖననం చేస్తుంటారు. గ్రామ జనాభాలో వీరు 80 శాతం వరకు ఉంటారు. ఇప్పుడు ఈ కులాల్లో చాలామంది ఖననానికి బదులు దహనం చేయడానికే ఇష్టపడుతున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వైకుంఠధామం వీరి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. వైకుంఠధామం అందుబాటులోకి వచ్చిన తరువాత గత రెండేండ్లుగా ఖననాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సబ్బండ వర్ణాలన్నీ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం మేరకు అన్ని కులాలవారు వైకుంఠధామంలోనే మృతదేహాలను దహనం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ గ్రామంలో ఖననాలు లేవు. వాస్తవానికి ఖననం ఖర్చు కంటే దహనం ఖర్చు ఎక్కువ. దహనానికి అయ్యే కట్టెల ఖర్చు కూడా భరించలేని పేదలకు గ్రామ సర్పంచ్ గుండారం శంకర్ తన సొంత ఖర్చులతో వాటిని సమకూరుస్తానంటూ ముందుకొచ్చారు. దీంతో పేద కుటుంబాలు సైతం దహనం వైపు మొగ్గుచూపుతున్నాయి.
దాడి తెగలోనూ మార్పు
బోధన్ మండలం రాజీవ్నగర్ తండాలోని దాడి తెగవారు ఖననం చేసే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు వీరు కూడా తమ సంప్రదాయాన్ని మార్చుకుంటున్నారు. మృతదేహాలను ఖననం కంటే దహనం చేయడానికే మొగ్గుచూపుతున్నారు. వీరి ఆలోచనా ధోరణిని మార్చింది కూడా సకల సౌకర్యాలు ఉన్న వైకుంఠధామమే.
ఊరంతా దహనం వైపే
మా గ్రామంలోని అన్ని కులాల వారు ఇప్పుడు మృతదేహాలను దహనం చేస్తున్నారు. సకల సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని చూసిన తర్వాత గ్రామస్తుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. మరోవైపు, ఖననాలకు స్థలం సరిపోవడం లేదు. దీంతో సబ్బండవర్ణాలు సమావేశమై వైకుంఠధామాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. గ్రామంలో ముస్లింలు మినహా మిగతా కులాలవారు ఎవరూ ఖననం చేయడంలేదు.
– గుండారం శంకర్, సర్పంచ్, పెగడాపల్లి, బోధన్ మండలం
మొదటిసారిగా దహనం చేశాం
లంబాడీల్లో ‘దాడి’ తెగ మాది. మా తెగలో తరతరాలుగా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. వైకుంఠధామం ఏర్పాటుతో మా ఆలోచనల్లో మార్పు వచ్చింది. మా తెగలోని కొంతమంది ఖననాలకు బదులు దహనం చేయాలని భావిస్తున్నారు. ఏడాది కిందట మా అమ్మ చనిపోయింది. తనను వైకుంఠధామంలోనే దహనం చేయాలన్నది అమ్మ కోరిక. దీంతో అమ్మను వైకుంఠధామంలోనే దహనం చేశాం.
– రత్నావత్ శివ, రాజీవ్నగర్తండా, బోధన్ మండలం
వైకుంఠధామంతోనే ఈ మార్పు
వైకుంఠధామం ఏర్పాటు తరువాత మా గ్రామస్తుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ కులం వారైనా సరే.. మృతదేహాలను ఖననం చేయడం లేదు. అంతిమ సంస్కారాల కోసం వైకుంఠధామానికే తీసుకొస్తున్నారు. ఇక్కడ అన్ని కులాల వారు అంత్యక్రియలు నిర్వహించుకొనే అవకాశం ఉండటంతో అందరూ సమానమేనన్న భావన కలుగుతున్నది. ఇది ప్రజల్లో ఐక్యతకు దోహదం చేస్తున్నది.
– తిరుమల రామయ్య, పెగడాపల్లి గ్రామస్తుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

