KTR | కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.70 వేల కోట్లు రైతుబంధు వేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అదే కాంగ్రెస్ పాలనలో ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు పడుతుందని తెలిపారు.
తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసీఆర్ ఆపలేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని తెలిపారు. .కాంగ్రెస్ పాలనలో యూరియా బస్తాల కోసం రైతులు క్యూలైన్లో నిలబడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఒక ఆధార్ కార్డుపై ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. భర్త, కొడుకు ఆధార్ పేరు మీద రెండు యూరియా బస్తాలు ఎక్కువ తీసుకుందని ఓ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని గుర్తుచేశారు. సంగెం మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డు, తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకున్నదని.. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి, ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే, ఏదో మర్డర్ చేసినట్టు మహిళా రైతులు అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని కేటీఆర్ అన్నారు. ఏడాదికి బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్ల బడ్జెట్ పెడతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. మేం ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని తెలిపారు. లంకె బిందెలు, గల్లా పెట్టెలు కాదు.. ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ము ఉండాలని అన్నారు. చేతకాని వాళ్లు నడిపితే పరిపాలన ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలన్నీ తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.