హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పథకంగా చెప్పుకుంటున్న ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ (Indiramma Indlu) పేదలకు గూడునివ్వడంలో పూర్తిగా విఫలమవుతున్నది. దాదాపు లక్ష ఇండ్లు పునాదుల వద్దే నిలిచిపోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సాయం చాలక, సకాలంలో బిల్లులు అందక, బిల్లుల కోసం లంచాలు ఇచ్చుకోలేక చాలామంది లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునేందుకు ముందూ వెనుకా ఆలోచిస్తుంటే.. నిబంధనలకు అనుగుణంగా లేవంటూ కేంద్ర ప్రభుత్వం మరికొన్ని ఇండ్లను రద్దు చేస్తున్నది. దీంతో ప్రభుత్వాన్ని నమ్మి నిండా మునగడం కంటే ముందే మేల్కోవడం ఉత్తమమని లబ్ధిదారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక 4.5 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేసింది.
ఇందులో ఇప్పటివరకు 3.05 లక్షల ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించింది. అందులో 2.25 లక్షల ఇండ్ల నిర్మాణం మాత్రమే మొదలైంది. వాటిలో దాదాపు లక్ష ఇండ్లు పునాదులు, గోడల వద్దే నిలిచిపోయాయి. పునాదులు పూర్తయ్యాక రావాల్సిన మొదటి బిల్లు కూడా రాకపోవడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు బిల్లులు ఒకేసారి వస్తాయనే ఉద్దేశంతో కొందరు గోడలు కూడా నిర్మించుకున్నారు. ఆ ప్రక్రియ పూర్తయి దాదాపు 6 నెలలు దాటినా మొదటి బిల్లు కూడా రాకపోవడంతో నిర్మాణాలను నిలిపివేశారు. దీంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా ఇండ్లను రద్దుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 15 రోజుల్లో నిర్మాణాలు మొదలుపెట్టాలని, లేనిపక్షంలో ఇంటిని రద్దుచేస్తామని పేర్కొంటూ నోటీసులు జారీచేస్తున్నారు.
పనిచేయని కాల్ సెంటర్
నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ పనులు మొదలయ్యాక నిర్ణీత గడువులోగా నిర్మాణ పురోగతిని ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఫోటోలు అప్లోడ్ అయిన వారం రోజుల్లోగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు జమ కావాలి. కానీ, ఇందులో ఏ ఒక్క ప్రక్రియ కూడా సజావుగా సాగడంలేదు. ప్రభుత్వం అందించే సాయం సరిపోతుందో లేదో, బిల్లులు వస్తాయో రావో అనే అనుమానంతో చాలామంది నిర్మాణాలు మొదలుపెట్టలేదు. పనులు మొదలుపెట్టినవారిలో దాదాపు లక్ష మంది లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణాలను నిలిపివేశారు. బిల్లులు మంజూరు చేయించేందుకు క్షేత్రస్థాయి అధికారులు లంచాలను ఆశిస్తున్నారని, వాటిని ఇచ్చుకోకుంటే ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా సతాయిస్తున్నారని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు.
లబ్ధిదారులే ఇల్లు వద్దంటున్నారట!
ఆర్ధిక కారణాలతో ఇందిరమ్మ ఇండ్లు వద్దంటూ స్వయంగా లబ్ధిదారులే దరఖాస్తు చేసుకుంటున్నారని, అయినప్పటికీ వారి ఇంటి కేటాయింపును రద్దు చేయడం లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ చెప్పారు. లబ్ధిదారులకు ఆర్ధికంగా తోడ్పాటునందించి ఇంటిని సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నందున బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సూచించారు. బిల్లులను సకాలంలో చెల్లించేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.