హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతున్నాయి. రెండేండ్లుగా మంజూరైన నిధుల్లో దాదాపు సగం కంటే ఎక్కువగా అధికారుల జేబుల్లోకి చేరిపోయినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా గురుకులాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాశాఖ అజమాయిషీలో గురుకులాలు లేకపోవడం, సొసైటీ నిధులపై ఆడిట్ నిర్వహించకపోవడంతో ప్రిన్సిపాల్స్ ఇష్టారీతిన వ్యవహరించినట్టు సమాచారం. బోగస్ బిల్లులతో లక్షల్లో నొక్కేసినట్టు తెలుస్తున్నది.
నూతన విద్యావిధానం-2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో సమగ్రంగా మార్పులు తీసుకొచ్చేలా వసతుల కల్పనకు నిధులను సమకూర్చడం పథకం ప్రధాన లక్ష్యం. పథకం కింద నిధుల సాయానికి ఆన్లైన్ చాలెంజ్ పోర్టల్ ద్వారా నేరుగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) కలిగిన ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల నుంచి కేంద్రమే దరఖాస్తులను స్వీకరించింది. మూడు దశల్లో వడపోత ద్వారా పథకం కింద పాఠశాలలను ఎంపిక చేసింది.
దేశవ్యాప్తంగా దాదాపు 16 వేలకు పైగా విద్యాసంస్థలకు పథకం కింద నిధులు సమకూరుతున్నాయి. తెలంగాణలో 800వందలకుపైగా విద్యాసంస్థలు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీల నుంచి దాదాపు 85కుపైగా గురుకులాలు ఉన్నాయి. ఎంపికైన స్కూళ్లకు ఏడాదికి దాదాపు రూ.10 లక్షలకుపైగా నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నది. వీటికి సంబంధించి నిధుల వినియోగంపై ఆడిట్ కొనసాగుతున్నా.. గురుకులాల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇదే అదునుగా ఆయా గురుకుల సొసైటీల ప్రిన్సిపాల్స్ అక్రమాలకు పాల్పడ్డట్టు తెలిసింది.
సొసైటీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అజమాయిషీ లేకపోవడంతో పీఎంశ్రీ నిధులు పెద్దఎత్తున గురుకులాల్లో గోల్మాల్ జరిగినట్టు తెలుస్తున్నది. బోగస్ బిల్లులతో ప్రిన్సిపాల్స్ లక్షలు నొక్కేసినట్టు తేటతెల్లమవుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ గురుకులమే అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. గురుకులంలో వాటర్ ట్యాంక్ మరమ్మతులకు రూ.లక్ష, సెప్టిక్ట్యాంక్ మరమ్మతుకు రూ.80వేలు వెచ్చించినట్టుగా బిల్లులు చూపడం గమనార్హం. అంతేకాదు ఫీల్డ్, ఎక్స్పోజర్ విజిట్లు, క్రీడా, సైన్స్ పరికరాల కొనుగోలు పేరిట లక్షలు జేబుల్లో నింపుకున్నట్టు తెలుస్తున్నది.
వాస్తవంగా ఆయా ఖర్చులను సంబంధిత ఏజెన్సీలు పేరిట చెక్ ఇవ్వడం పరిపాటి. కానీ ఇక్కడ మాత్రం టీచర్ల పేరు మీదనే చెక్కులు ఇవ్వడం కొసమెరుపు. ఎలాంటి పరికరాల కొనుగోళ్లు, వసతుల కల్పన చేపట్టకుండానే నిధులను గురుకుల సిబ్బంది పేరుమీదనే చెక్కులు జారీ చేసి, తిరిగి వాటిని జేబుల్లో నింపుకున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు సొసైటీ వర్గాలు చెప్తున్నాయి. విద్యార్థుల అభివృద్ధికి చెందాల్సిన నిధులు అవినీతిపరుల పాలయ్యాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ఆర్థికశాఖ, సొసైటీ వర్గాలు మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.