హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్‌బోర్డు చరిత్రలో ఫస్టియర్‌లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మహర్దశ వచ్చింది. 2015-16 విద్యాసంవత్సరంలో తెలంగాణ సర్కారు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఫీజు మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాలేజీల్లో వసతుల కల్పనకు రూ.662 కోట్లు వెచ్చించింది. దీంతో సర్కారు కాలేజీలపై విద్యార్థులకు నమ్మకం ఏర్పడింది. రెసిడెన్షియల్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హవాలోనూ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరుగుతున్నా యి. లక్ష అడ్మిషన్లు దాటడంపై ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని అధ్యాపకుల బృందం గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మిఠాయిలు తినిపించింది.
ఉచిత విద్యతో పెరుగుతున్న ప్రవేశాలు : మంత్రి సబితా
దేశంలోనే తొలిసారిగా పూర్తి ఉచితంగా విద్యనందించడం వల్లే తెలంగాణ సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఉచిత పుస్తకాలు, అడ్మిషన్ ఫీజుల మాఫీ తదితర విప్లవాత్మక నిర్ణయాల వల్లే ఫస్టియర్ ప్రవేశాలు లక్ష దాటాయని తెలిపారు. గురువారం గన్‌ఫౌండ్రీలోని తన కార్యాలయంలో నూతనంగా రూపొందించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఆంగ్లం, సెకండియర్ తెలుగు పాఠ్యపుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య పట్ల ప్రజలకున్న విశ్వాసానికి అడ్మిషన్లు లక్షకుపైగా చేరడమే నిదర్శనమని చెప్పారు. అత్యధికంగా ఫలక్‌నుమా కాలేజీలో 2,061 మంది, ఆరు కాలేజీల్లో వెయ్యికిపైగా మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో రూ.9 కోట్లు వెచ్చించి, ప్రభుత్వ కాలేజీలతోపాటు సంక్షేమ గురుకులాలు, మోడల్‌స్కూళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ప్రొఫెసర్ సూర్యధనుంజయ్, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, వసుంధర తదితరులు పాల్గొన్నారు.