హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఫ్యాటీ లివర్… ఎపిడమిక్తో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరిపై ప్రభావం చూపుతున్నదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవగాహనలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫ్యాటీ లివర్ నివారణ దినం సందర్భంగా ఏఐజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఫ్యాటీ లివర్ సమస్య ప్రస్తుతం ప్రపంచ అనారోగ్య సమస్యగా మారుతున్నదని చెప్పారు. వైద్యులు ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం, ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకునేలా అవగాహన కల్పించడం అవసరమని చెప్పారు.
కాలేయ సమస్యల్లో ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత విసృ్తతమైన సమస్యల్లో ఒకటిగా మారిందని తెలిపారు. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఊబకాయం, మధుమేహం వంటి వాటివల్ల నాన్ఆలహాలిక్ ఫ్యాటీలివర్ వ్యాధికి కారణమని వివరించారు. కాలేయ క్యాన్సర్కు కూడా ఈ వ్యాధితో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నదని వివరించారు. పాఠశాలలు, ఇండ్లు, సమాజంలో కాలేయ ఆరోగ్యం గురించి చర్చ జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐజీ హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కులకర్ణి, కార్డియాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనూజ్ కపాడియా, హెపటాలజీ చీఫ్ డాక్టర్ పీఎన్ రావు, సెంటర్ ఆఫ్ ఒబెసిటీ ఎండోసోపి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.