నేరడిగొండ, ఫిబ్రవరి 3 : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడిగొండ మండలంలోని అదిలాబాద్-నిర్మల్ రహదారి పై నారాయణపూర్ గ్రామ సమీపంలో కారు బోల్తా పడి (Car overturns)నోముల వెంకట్ రెడ్డి(65) అక్కడికక్కడే మృతిచెందగా, కొడుకు శరత్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోథ్ మండలం కౌట (బి) గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి (విశ్రాంత ఉపాధ్యాయుడు), నోముల శరత్ రెడ్డి తండ్రి కొడుకులు పనిమీద గ్రామానికి వచ్చి నిర్మల్ వెళుతున్నారు.
ఈ క్రమంలో నారాయణపూర్ వద్ద టైర్ పగిలి ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొని బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా శరత్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు శరత్రెడ్డిని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.