హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కమీషన్ల పర్వం తారాస్థాయికి చేరింది. బిల్లుకో కమీషన్ రేటు ఫిక్స్చేసి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డీఎంఈ, టీవీవీపీ పరిధిలోని దవాఖానలకు ఇటీవల చెల్లించిన రూ.7 కోట్ల లాండ్రీ బిల్లుల్లో ఏకంగా రూ.కోటి కమీషన్ వసూలు చేసినట్టు తెలుస్తున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 46, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని 150కిపైగా దవాఖానల్లో పేషెంట్లకు వినియోగించే దుప్పట్లు, బెడ్షీట్లను ఉతికే కాంట్రాక్టును ఇన్ఫెక్షన్ కంట్రోల్ విభాగం నలుగురు వ్యక్తులకు అప్పగించింది.
గతంలో బెడ్షీట్లు, దుప్పట్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేది. వాటిని ఉతికే బాధ్యతలను మాత్రమే లాండ్రీ కాంట్రాక్టర్లు చూసుకునేవారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడంతో దుప్పట్లు, బెడ్షీట్ల కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకున్నది. దీంతో డీఎంఈ, టీవీవీపీ పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లోని లాండ్రీ కాంట్రాక్టర్లే వాటిని కొనుగోలు చేసి సరఫరా చేయడంతోపాటు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. గత మూడేండ్లుగా వారికి రూ.7 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉ న్నాయి. రూ.కోటి కమీషన్ ముట్టజెపితే ఆ బకాయిలు క్లియర్ చేస్తామని వైద్యారో గ్య శాఖ అధికారులు స్పష్టం చేయడంతో ఆ ప్రతిపాదనకు కాంట్రాక్టర్లు అంగీకరించినట్టు తెలిసింది. 3 నెలల క్రితం జరిగిన ఈ అవినీతి బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. వైద్యారోగ్య శాఖలో అవినీతి జరుగుతున్నా సర్కార్ మిన్నకుండిపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.