Nallagonda Medical College | హైదరాబాద్ : నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్ సహజమే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇటీవల సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ ఫస్టియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకుని, మీ సంగతి చెప్తామంటూ జూనియర్లను సీనియర్లను మరోసారి బెదిరింపులకు గురి చేశారు. సీనియర్లు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, అవన్ని సహజం, వచ్చే ఏడాది మీరు కూడా సీనియర్లు అవుతారంటూ నిర్లక్ష్యంగా కాలేజీ ప్రిన్సిపాల్ సమాధానమిచ్చారు.
‘ర్యాగింగ్‌ను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్‌రెడ్డితో కలిసి ఆమె కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్వోడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో కలెక్టర్ విడివిడిగా చర్చించారు.
కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా వైద్య కళాశాలకు మెంటర్లను, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎలాంటి రికమండేషన్లు పని చేయవన్నారు. విలువైన జీవితాన్ని విద్యార్థులు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఏవైనా సమస్యలుంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.