హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగడంతో తొలిరోజే నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) 2026 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 382, బీఆర్ఎస్ నుంచి 258, బీజేపీ నుంచి 169, సీపీఎం నుంచి 8, బీఎస్పీ నుంచి 7, ఆప్ నుంచి ఒకటి, ఎంఐఎం నుంచి మూడు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 19, స్వతంత్ర అభ్యర్థులు 55 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఎస్ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీల్లో జనరల్ అభ్యర్థులకు నామినేషన్ ఫీజు 2,500, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.1,250 గా నిర్ణయించారు. కార్పొరేషన్లలో ఇది వరుసగా రూ.5,000, 2,500గా పేర్కొన్నారు. మున్సిపాలిటీ వార్డు సభ్యుడు రూ.1,00,000 వరకు ప్రచారానికి ఖర్చు చేసేందుకు అనుమతి ఉన్నది.