మార్చి 15న పట్నం మహేందర్‌రెడ్డి చీఫ్‌విప్ అని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. అలాంటప్పుడు జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా ఆయనను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారు. ఒకే వ్యక్తికి సంబంధించిన హోదాల విషయంలో భిన్నమైన ఆదేశాలు ఎందుకు వెలువడ్డాయి. ఈ విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.
Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : శాననమండలిలో చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు చెందిన ఆయనను ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎలా నియమిస్తారని నిలదీశారు. ఆయనపై శాసన మండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ పెండింగ్‌లోనే ఉన్నదని గుర్తుచేశారు. ‘సాంకేతికంగా, మండలి చైర్మన్ మండలి సమావేశాల సందర్భంగా జారీ చేసిన బులెటిన్‌లో కూడా పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌గా నియమించింది. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్న ఆయనకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీచేస్తే ఆయన పాటించాల్సిందే.. మరి కాంగ్రెస్ సభ్యులకు పట్నం మహేందర్‌రెడ్డి ఇచ్చే విప్ చెల్లుతుందా?’ అని హరీశ్ ప్రశ్నించారు. పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ జారీ చేస్తారని, అధికార పార్టీ సభ్యులకా లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకా? అంటూ ఎద్దేవా చేశారు.
ఆయన విప్ జారీ చేస్తడా? లేక బీఆర్ఎస్ ఇచ్చిన విప్‌ను పాటిస్తాడా? అని ప్రశ్నించారు. ఆదివారం శాసనమండలిలో మీడియా ఇష్టాగోష్ఠిలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ వారిని చీఫ్ విప్ చేస్తే ఏ పార్టీకి ఆయన విప్‌జారీ చేస్తాడని విస్మయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు రా జ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదనేందుకు పట్నం నియామకమే మరో ఉదాహరణ అని, పీఏసీ, చీఫ్ విప్ల ఎంపిక విషయాల్లో ఇది స్పష్టం గా అర్థమవుతున్నదని చెప్పారు. మహేందర్‌రెడ్డి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశాడని గుర్తుచేశారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ చైర్మన్ వద్దే పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమిస్తున్నట్టు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అనర్హత పిటిషన్లో చైర్మన్ ఇచ్చిన బులెటిన్‌ను కూడా చేరుస్తామని తెలిపారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని, పట్నం మహేందర్‌రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మార్చి 15న పట్నం మహేందర్‌రెడ్డి చీఫ్ విప్ అని ఆదేశాలిచ్చారని, జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీ హోదాలోనే జాతీయ జెండా ఎగరవేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే జీవో జారీ చేశారని, చీఫ్ విప్‌గా ఆమె జీవో ఇచ్చి, జాతీయ జెండా విషయంలో మాత్రం ఎమ్మెల్సీగా పేర్కొన్నారని, ఒకే అధికారి, ఒకే వ్యక్తికి సంబంధించిన హోదాల విషయంలో ఎందుకు భిన్నమైన ఆదేశాలు ఇచ్చారో ఆమె చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. మార్చి 15నే పట్నం మహేందర్‌రెడ్డి చీఫ్ విప్ అయ్యి ఉంటే జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా పట్నంను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు. రెండు జీవోలు కూడా గవర్నర్ పేరుమీదే విడుదలయ్యాయని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయంలో గవర్నర్‌ను కూడా పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎస్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఏ నియామకాలైనా రాజ్యాంగబద్ధంగానే జరిగాయని శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై మండలి కార్యాలయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. మహేందర్‌రెడ్డి విషయంలో రాజ్యాంగ పరిధిలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. హరీశ్‌రావుకు, బీఆర్ఎస్ వారికి అనుమానాలుంటే వ్యవస్థల పరంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష సభ్యుడినే స్పీకర్‌గా చేశారని, గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులను ఒకరి తర్వాత ఒకరిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం శాసనమండలి ప్రాంగణంలో తనకు కేటాయించిన చాంబర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, వాణీదేవి, నవీన్ కుమార్‌రెడ్డి, తాతా మధు, యాదవరెడ్డి, టీ రవీందర్రావు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, దేవీ ప్రసాద్, గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుల ఉమ, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సిరికొండకు అభినందనలు తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నాయకులు మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్, కిషోర్‌గౌడ్, ఉపేంద్రాచారి, రాగిడి లక్ష్మారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.