హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల మద్దతు కూడగట్టడంలో భాగంగా వారు రాష్ర్టానికి వస్తున్నారు.
ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే సభలో వారు పాల్గొంటారని బాలమల్లేశ్ చెప్పారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో గురువారం బాలమల్లేశ్ అధ్యక్షతన నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా సన్నాహక సమావేశం జరిగింది. చేగువేరా కుమార్తె, మనుమరాలికి ఘనంగా స్వాగతం పలకాలని సమావేశంలో నిర్ణయించారు. రవీంద్రభారతిలో జరిగే సభకు అన్ని రాజకీయ పార్టీల(బీజేపీ, ఎంఐఎం మినహా)ను ఆహ్వానించాలని నిర్ణయించారు.