హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణకు టీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీఎస్ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను దశలవారీగా సరఫరా చేయనున్నది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్డర్ అని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ ప్రదీప్ వెల్లడించారు.
ఎయిర్కండీషన్డ్ ఇంటర్ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒలెక్ట్రాకు టీఎస్ఆర్టీసీ ఈ-బస్సుల ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. వచ్చే రెండేండ్లలో 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్టు తెలిపారు.