హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : పారా మిలిటరీ దళాలకు పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా గురువారం ఎన్‌ఎంవోపీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి.. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం యావత్తు ఉగ్రమూకల దాడిని ఖండించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఏకమై భరతమాత రక్షణకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. టీఎస్సీటీఎస్ఈయూ రాష్ట్ర కోశాధికారి నరేశ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం టెర్రరిస్టులను ఏరివేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని మతాలు ఏకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంవోపీఎస్ బాధ్యులు శ్యాంసుందర్, నటరాజ్, సుశీల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.