బనకచర్లపై తెలంగాణలోవ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. వాళ్లు ఏమంటున్నారంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చేద్దామంటున్నారు.. వాళ్లు మాట్లాడకూడని అంశాలను మీరు మాట్లాడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులే వారి పబ్బం గడుపుకొనేందుకు ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు.
– ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి..
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్‌లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. రేవంత్ తీరుపై ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బనకచర్లకు ఒక్క ఇటుక పడినా అది.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేసే బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరుపై
అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కాంగ్రెస్‌కు మరణశాసనంలాంటి బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా.. ఎవరు చెప్పినా ఒప్పుకొనే సమస్యే లేదని స్పష్టంచేస్తున్నారు. సీఎల్పీ, పీసీసీ, క్యాబినెట్లో దీనిపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
చర్చలేకుండా వెళ్లి సంతకాలు పెడితే ఊపేక్షించే ప్రసక్తేలేదని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వం, పార్టీలో పెద్ద ఎత్తున చర్చ పెట్టాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. ‘ఇది రేవంత్‌రెడ్డి సొంత రాజ్యం కాదు.. ఆ ఒక్కడి కోసం రాష్ట్రంలో పార్టీని సమాధి చెయ్యాలా? ఆ ఒక్కడి కోసం మా రాజకీయ భవిష్యత్తును ఎందుకు పణంగా పెట్టాలి’ అని నిలదీస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా ముక్తకంఠంతో బనకచర్ల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే ఈ విషయంలో మర్లవడేందుకు కూడా సిద్ధమని తెగేసి చెప్తున్నారు. కాదూకూడదంటూ మోనార్కులా ముందుకెళ్తే రాజకీయంగా ‘తలలు’ ఎగరడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
‘నమస్తే కథనం’ అక్షర సత్యం..
‘బనకచర్లతో కాంగ్రెస్‌లో భూకంపం’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. రాజకీయవర్గాలు, పరిశీలకులు, కాంగ్రెస్ నేతల్లో ఎక్కడ చూసినా దీనిపై చర్చ కొనసాగింది. బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకెళ్తే పార్టీకి, తమ భవిష్యత్తుకు రాజకీయంగా సమాధి తప్పదంటూ కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్న చర్చను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టడం సంచలనంగా మారింది. ఈ కథనం వల్ల తమకు కొంత భరోసా దొరికినట్టయిందని అసలు కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ‘నమస్తే తెలంగాణ’ రాసిన ప్రతి అక్షరం సత్యమని, బనకచర్లకు అంగీకరిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండబోవని, మరికొన్ని దశాబ్దాల దాకా కాంగ్రెస్ గురించి ఆలోచించే పనే ఉండబోదని అసలు కాంగ్రెస్ నేతలు వాపోయారు.
‘నమస్తే తెలంగాణ’ కథనం బాగున్నదంటూ కాంగ్రెస్ ముఖ్యులు పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ‘మీ కథనంతోనైనా మా ముఖ్యమంత్రి కండ్లు తెరిస్తే బాగుండు. అధికారం సంగతి పక్కన పెడితే పార్టీ అన్నా బతుకుతుంది. కానీ మా ముఖ్యమంత్రిలో ఆ కనువిప్పు ఉన్నట్టే కనిపించడం లేదు. పార్టీ ఎటు పోతేనేం? ఏమైపోతేనేం? నేను బాగుంటే చాలు అనుకుంటున్నట్టున్నరు’ అని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పెదవి విరిచారు. ‘తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల అన్యాయం నుంచి. బీఆర్ఎస్ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి మరోసారి గోదావరి నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నరు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా నీళ్ల విషయంలో ప్రజలకు పూర్తి చైతన్యం ఉన్నది. మిగిలిన రాష్ర్టాలకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల విషయంలో ఏ పార్టీ వైఖరి ఏంటి? ఏం చేస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లుతది? చంద్రబాబు ఎవరు? ఆయన ధోరణి ఎలా ఉంటది? ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటది? రేవంత్‌రెడ్డి నిజాయితీ ఎంత? అనే అంశాలు ప్రజలకు పూర్తిగా తెలుసు. ఈ వాతావరణంలో బనకచర్లపై రేవంత్ వైఖరి బీఆర్ఎస్కు వరంగా మారింది.
ఇప్పటికే ఆ పార్టీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలకు వెళ్తున్నయి. విద్యార్థులను కూడా చైతన్యపరుస్తున్నరు. ఈ తరుణంలో బనకచర్ల మా పార్టీ పాలిట మరణశాసనమే’ అని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి బనకచర్లను ససేమిరా వ్యతిరేకించడం.. రెండు బనకచర్లను ఆమోదించి మేమంతా రాజకీయంగా సమూహిక ఆత్మహత్య చేసుకోవడం. వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉన్నది’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘అసలు రేవంత్‌రెడ్డి ఎవరు? తెలంగాణ పట్ల ఆయన నిబద్ధత ఎంత? తెలంగాణ అన్నా.. ప్రభుత్వమన్నా.. కాంగ్రెస్‌పార్టీ అన్నా ఆయన ఒక్కరేనా? ఆయనేమైనా మోనార్కా? బనకచర్లపై సంతకం పెట్టే ముందు ఆయన ఎవరితో చర్చించారు? ఎవరి ఆమోదం తీసుకున్నారు? బనకచర్లను వ్యతిరేకిస్తామని హైదరాబాద్‌లో మాకు చెప్పి, బహిరంగంగా విలేకరులకు చెప్పి ఢిల్లీకి పోయి సంతకాలు పెట్టి వస్తారా? ఇదేం పద్ధతి? ఆయన ఎలాగూ దెబ్బతిని ఉన్నరు. మమ్మల్నందరినీ నాశనం చేస్తామంటే ఊరుకుంటామా?’ అని ఓ సీనియర్ మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఇదే చర్చ
‘నమస్తే తెలంగాణ’ కథనం తర్వాత పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బనకచర్ల అంశంపై చర్చల్లో మునిగితేలినట్టు కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బనకచర్లపై ప్రభుత్వం, పార్టీ, తెలంగాణ సమాజంలోనూ కూలంకషంగా చర్చ జరిగిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని వారంతా ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లను పిలిపించి ప్రభుత్వం దీనిపై చర్చించాలి. బనకచర్ల పర్యవసానాలు ఏమిటి? అనేదానిపై నిర్ధారణకు రావాలి. ఆ తర్వాత టీపీసీసీ స్థాయిలో దీనిపై సమగ్ర చర్చ జరపాలి. అనంతరం సీఎల్పీ సమావేశం నిర్వహించి బనకచర్లపై తీసుకున్న నిర్ణయానికి దాని ఆమోదం పొందాలి. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించి అధికారికంగా అందులో పాలసీ ఖరారు చేయాలి. ఇదంతా జరిగేదాకా బనకచర్లపై ప్రతిపాదిత కమిటీకి తెలంగాణ ప్రభుత్వం పేర్లు ఇవ్వనేకూడదు. కమిటీ ఏర్పాటు విషయాన్ని పూర్తిగా పెండింగ్‌లో పెట్టాలి’ అనే డిమాండ్‌ను ముఖ్యమంత్రికి వినిపించాలని ఈ చర్చల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక అవగాహనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.